బుడమేరు వరదలపై ఆర్పీ సిసోడియా వ్యాఖ్యలపై పెను దుమారం!
ఈ సమయంలో వరదలు మిగిల్చిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఏపీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా తెలిపారు.
విజయవాడను బుడమేరు ముంచేసిన సంగతి తెలిసిందే. ఆ వరద దాటి నుంచి బెజవాడ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేని, తేరుకోలేని పరిస్థితి. ఈ సమయంలో వరదలు మిగిల్చిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఏపీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా తెలిపారు. ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఇప్పుడు పెను దుమారం రేగుతోంది.
అవును... బుడమేరు వరదలు విజయవాడను గతంలో ఎన్నడూ లేని విధంగా ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీలో పెను రాజకీయ దుమారం కూడా లేస్తోంది. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితం అంటూ వైసీపీ విచురుకుపడుతుంది. అయితే.. ప్రభుత్వం వాటిని కొట్టిపారేస్తోంది. ఈ సమయంలో బుడమేరు వరదపై ఏపీ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా సంచలన కామెంట్లు చేశారు.
ఇందులో భాగంగా... వరద వస్తుందని తమకు ముందే తెలుసని.. 35వేల క్యూసెక్కుల వరద వస్తుందని ముందుగానే తెలుసని అన్నారు. అదేవిధంగా డైవర్షన్ ఛానల్ లో ఉన్న నీరు అంతా ఈ స్థాయిలో యునైటెడ్ చేస్తుందని ఊహించలేకపోయామని తెలిపారు. ఇదే సమయంలో రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఎంతవరకూ సాధ్యమనేది కూడా ఆలోచించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదే క్రమంలో... గోదావరి జిల్లాల్లోని లంక గ్రామ వాసులను వరద విషయంలో అప్రమత్తం చేస్తే.. ఆ విషయం తమకు తెలుసని, చాలా వరదలే చూశామని చెప్తారని.. సింగ్ నగర్ లో ప్రజలు కూడా అలానే వ్యవహరించినట్లుగా సిసోడియా అన్నారు!! దీంతో... ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిపోయి.. 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే సాధ్యాసాధ్యాలపై మాట్లాడటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు!
మరోపక్క... సోమవారం నుంచి ముడు రోజుల పాటు వరద నష్టం అంచనా వేస్తామని సిసోడియా తెలిపారు. ఈ సమయంలో బాధితులు ఇళ్లల్లో ఉంటే పూర్తిస్థాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందని తెలిపారు. 32 వార్డుల్లో, రెండు లక్షల ఇళ్లల్లో వరద నష్టాన్ని లెక్కించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 149 మంది తహసిల్దార్లు పాల్గొంటారని ఆయన తెలిపారు.