మోడీ వారసుడు కోసం...ఆర్ఎస్ఎస్ అదే పని మీద ఉందా ?
మోడీ వారసుడిని ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తోందని, ఈ మేరకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోందని కూడా ఆయన అన్నారు.;

బీజేపీకి సొంతంగా రెండు సార్లు పూర్తి స్థాయి మెజారిటీ తెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ. ఆయనకు విజయేంద్ర మోడీ అని కాషాయ దళం ముద్దుగా పెట్టుకుంటున్న పేరు అని అంటారు. గుజరాత్ ని ఏకంగా పదమూడేళ్ళ పాటు నిరాటంకంగా పాలించిన నరేంద్ర మోడీ అనూహ్యంగా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎంపీ కాకుండా కేంద్ర మంత్రిగా పని చేయకుండా ఎకాఎకిన ఆయన ప్రధాని అయిపోయారు.
ఇది నిజంగా గ్రేట్ అనే అంటారు. భారత్ వంటి సువిశాల దేశాన్ని మోడీ గుజరాత్ సీఎం గా పనిచేసిన అనుభవం తోనే గత పదకొండేళ్లుగా పాలిస్తున్నారు. ఇక 2024లో బీజేపీకి మెజారిటీ సొంతంగా రాకపోయినా మోడీ ఎన్డీయే మిత్రులను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరో నాలుగేళ్ళ పాటు ఆయన ప్రధానిగా ఉంటారు అన్నది వాస్తవం.
ఆయన ఆ విధంగా వరసగా పదిహేనేళ్ళు ప్రధానిగా ఉండడం ద్వారా హ్యాట్రిక్ పీం గా ఉన్న నెహ్రూ రికార్డుని చేరుకుంటారు. అలాగే పదిహేనేళ్ళ కాలం పనిచేసి నెహ్రూ ఇందిరా తరువాత ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన మూడవ ప్రధానిగా చరిత్ర సృష్టిస్తారు. జమిలి ఎన్నికలు అని బీజేపీ అంటున్నా అది జరిగేది కాదని అంతా అంటున్నారు దాంతో 2029 దాకా మోడీ ఎలాంటి ఢోకా లేకుండా దేశానికి ప్రధానిగా ఉంటారు అని అంతా నమ్ముతున్నారు.
ఇక 2029లో కూడా బీజేపీ మళ్ళీ ఫుల్ మెజారిటీతో గెలిస్తే మోడీ నాలుగోసారి కూడా ప్రధాని అవుతారు అని ఆయన అభిమానులు చెబుతూంటారు. అయితే మోడీ పదవీ కాలం 11 ఏళ్ళే అని ఆయనను తప్పించేందుకు తెర వెనక ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని శివసేన యూబీటీ సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మోడీ వారసుడిని ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తోందని, ఈ మేరకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోందని కూడా ఆయన అన్నారు. నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ మొదటి సారి ఆదివారం సందర్శించిన సంగతి తెలిసిందే. మోడీ 11 ఏళ్ళ పాటు ప్రధానిగా ఉన్నా ఎపుడూ ఆర్ఎస్ఎస్ ఆఫీసుకు వెళ్ళలేదు. మరి ఆయన ఈ విధంగా రావడం వెనక ఏమి ఉంటుందని అంతా ఒక వైపు చర్చిస్తూంటే సంజయ్ రౌత్ మాత్రం కొత్త విషయాలను వెల్లడించారు.
తన పదవీ విరమణ గురించిన ప్లాన్స్ ఆర్ఎస్ఎస్ కి తెలియ చేయడం కోసమే ఆర్ఎస్ఎస్ ఆఫీసుకు మోడీ వచ్చారని ఆయన చెబుతున్నారు. తాను ఎంత కాలం ప్రధానిగా కొనసాగుతానో ఆయన ఆర్ఎస్ఎస్ కి తెలియ చేసి ఉంటారని ఆయన చెబుతున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం మోడీకి వారసుడు సిద్ధం కావాల్సిందే అని గట్టిగా భావిస్తోంది అని ఆయన అంటున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు పదవి విషయంలో మార్పు కోసం ఆర్ఎస్ఎస్ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తోంది అని ఆయన అన్నారు. అలాగే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీకి కూడా రెస్ట్ ఇచ్చి కొత్త నాయకత్వాన్ని తెచ్చి పెట్టాలన్నది ఆర్ఎస్ఎస్ అజెండా అని కూడా సంజయ్ రౌత్ చెబుతున్నారు.
పార్టీ నాయకత్వం కాకుండా దేశ నాయకత్వంలో మార్పుని కూడా ఆర్ఎస్ఎస్ కోరుకుంటోంది అని సంజయ్ రౌత్ అంటున్నారు. అందువల్ల ఆర్ఎస్ఎస్ అభీష్టం మేరకే అంతా జరుగుతుంది అని ఆయన చెబుతున్నారు. ప్రధానిగా మోడీ పదవీ కాలం తొందరలోనే ముగియబోతుంది అని ఆయన అంటున్నారు. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ దృష్టి అంతా బీజేపీ కొత్త అధ్యక్షుడు నియామకం మీదనే ఉందని చెబుతున్నారు.
ఆ ప్రక్రియ ముగియగానే నరేంద్ర మోడీ వారసుడు కూడా రెడీ అవుతారని అంటున్నారు. మరి సంజయ్ రౌత్ చెప్పినది నిజమా కాదా అంటే అంతా దీని మీదనే చర్చిస్తున్నారు. సంజయ్ రౌత్ పార్టీ బీజేపీకి వ్యతిరేకం కాబట్టి ఆయన అలాగే చెబుతారు అని అనుకున్నా ఆర్ఎస్ఎస్ కి మోడీకి ఉన్న గ్యాప్ ని పూరించుకోవడానికే ఆయన నాగ్ పూర్ టూర్ పెట్టుకున్నారు అన్న చర్చ కూడా ఉంది అంటున్నారు.
ఇక మోడీని ఇపుడు ఎందుకు తప్పిస్తారు అన్న చర్చ ఉండనే ఉంది. 2029 దాకా మోడీ నాయకత్వానికి ఎలాంటి ఢోకా లేదని కూడా అంటున్న వారు ఉన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ మాటే బీజేపీలో శాసనం కాబట్టి సంఘ్ ఏమి ఆలోచిస్తుంది అన్నది కూడా చూడాలని అంటున్నారు. అద్వానీ అంతటి వారే బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని సంఘ్ కోరిక మేరకు అలాగే చేశారు అని గతాన్ని గుర్తు చేస్తున్నారు.