బాహుబలి రేంజ్ లో రికార్డ్స్ కొడుతున్న ఆర్టీసీ!
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకానికి మహిళలు పోటెత్తుతున్నారు. మహాలక్ష్మి పథకం అంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకానికి మహిళలు పోటెత్తుతున్నారు. మహాలక్ష్మి పథకం అంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే. గడచిన 11 రోజుల్లో సుమారు 3 కోట్లమంది మహిళలు ప్రయాణించారు. ఇన్ని కోట్లమంది మహిళలు గతంలో ఏ సందర్భంలో కూడా ప్రయాణించింది లేదు. ప్రతిరోజు సగటున బస్సుల్లో 51 లక్షలమంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 30 లక్షల మంది మహిళలైతే మిగిలిన 21 లక్షలమంది పురుషులున్నారు. ఒకపుడు ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) సగటున 69 శాతం ఉండేది.
బస్సుల్లో ఉచిత ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుండి కొన్ని డిపోల్లో ఓఆర్ శాతం 100 శాతానికి టచ్ అయ్యింది. 16వ తేదీన 17 డిపోలు, 17వ తేదీన 20 డిపోలు, 18వ తేదీన 45 డిపోల్లో ఓఆర్ వందశాతం నమోదవ్వటం సరికొత్త రికార్డనే చెప్పాలి. గడచిన మూడురోజుల్లో జనాలు ఎక్కువగా యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేలు-ప్రజ్ఞాపూర్, హుజూరాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోల నుండి ప్రయాణిస్తున్నారు.
పథకం మొదలైన మొదటి వారంరోజులు ఎలాంటి గుర్తింపుకార్డులు లేకుండానే ప్రయాణానికి అనుమతించిన అధికారులు ఇపుడు గుర్తింపుకార్డులు అడుగుతున్నారు. జీరో టికెట్ ధరపైనే కండక్టర్లు టికెట్లను ఇష్యూ చేస్తన్నారు. జీరో టికెట్ ఎందుకు ఇస్తున్నారంటే బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారో తెలియాలి కాబట్టి. పైగా ఉచిత ప్రయాణానికి సంబంధించిన టికెట్ల డబ్బును ప్రభుత్వం ఆర్టీసీకి రీ ఎంబర్స్ చేయాలి కాబట్టి. నిజంగా ప్రభుత్వం ఆర్టీసీకి ఎప్పటికప్పుడు రీ ఎంబర్స్ చేస్తే సంస్ధ ఆర్ధిక కష్టాలు తొందరలోనే తీరిపోవటం ఖాయమనే అనిపిస్తోంది.
ఎలాగంటే గతంలో ఎంతరద్దీ ఉంటుందని అనుకున్నా అన్నీ డిపోల్లో 100 శాతం ఓఆర్ ఉండేదికాదు. కానీ ఇపుడు ఉచితం అనేటప్పటికి చాలా డిపోల్లో 100 ఓఆర్ రికార్డవుతోంది. కాబట్టి ప్రభుత్వం నుండి రావాల్సిన రీ ఎంబర్స్ మెంటు కూడా ఎక్కువగానే ఉంటుందనటంలో సందేహంలేదు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించటం తప్పనిసరి. అదికూడా గుర్తింపుకార్డుల్లోని ఫొటోలు అప్ డేట్ చేసుండాలి. ఎప్పుడో చిన్నప్పటి ఫొటో అంటించిన గుర్తింపుకార్డును చూపిస్తే కుదరదు.