ఏపీ ఎన్నికల్లో ప్లాన్స్ చెబుతున్న రుద్రరాజు... పెరిగిన గ్యారెంటీలు!
ఈ సందర్భంగా జనవరి 14వ తేదీ నుండి రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ న్యాయ్ యాత్ర పోస్టర్ ను విడుదల చేశారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు, తెలంగాణ ఫలితాలు పాజిటివ్ గా వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసరికి కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఉత్సాహంతో ఉంది! ఈ క్రమంలో వైఎస్సార్ హాయాంలో ఒక వెలుగు వెలిగిన ఏపీలోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఏపీలో "వై నాట్ కాంగ్రెస్" అనే నినాదంతో రంగంలోకి దిగుతుంది! రెండు దక్షిణాది రాష్ట్రాల్లోనూ సక్సెస్ కి సహకరించిన గ్యారెంటీలనూ ఏపీకి మోసుకుని వస్తుంది.
అవును... కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోనూ సత్తా చాటాలని తాపత్రయ పడుతుందని తెలుస్తుంది! అందులోనూ ప్రధానంగా లోక్ సభ స్థానల్లో సత్తాచాటాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకు సమన్వయకర్తలను రంగంలోకి దింపుతుంది!
ఈ క్రమంలో ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీచేస్తుందని తెలిపారు. ఇదే సమయంలో ఏపీలో ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి వెళుతున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు.
అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో గ్యారెంటీని పెంచుతుందన్న మాట. కర్ణాటకలో ఐదు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో మేనిఫెస్టో రూపొందించిన కాంగ్రెస్... ఏపీలో మరో గ్యారెంటీని పెంచి ఏడు గ్యారెంటీలతో రాబోతుందన్నమాట.
ఆ సంగతి అలా ఉంటే... వై నాట్ కాంగ్రెస్ నినాదంతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నామని చెప్పిన రుద్రరాజు ఈ నెల 10న విజయవాడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తో పీసీసీ సమావేశం ఏర్పాటు చేశామని, 11న ఒంగోలులో యూత్ కాంగ్రెస్ నాయకులతో యువభేరి సభ, అనంతరం పాదయాత్ర ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జనవరి 14వ తేదీ నుండి రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ న్యాయ్ యాత్ర పోస్టర్ ను విడుదల చేశారు. ఈ క్రమంలో మణిపూర్ లోని ఇంపాల్ లో మొదలవ్వబోయే ఈ యాత్ర సుమారు 66 రోజులపాటు సాగుతుందని తెలిపారు. ఈ రెండు నెలల పైన సమయంలోనూ సుమారు 15 రాష్ట్రాలు, 110 లోక్ సభ స్థానాలలో సాగుతుందని వెల్లడించారు.