జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి సీరియస్? ఎమ్మెల్యే ఏమన్నారు?
ఐసీయూలో ఉన్నారంటూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మీద జరుగున్న ప్రచారంపై నిజానిజాలు కనుగొనే ప్రయత్నం చేయగా షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి.
సోషల్ మీడియా..వాట్సాప్ లు వచ్చిన తర్వాత వార్తల స్వరూపమే మారిపోతోంది. గతానికి భిన్నంగా సాంకేతికత ఆధారంగా తప్పును ఒప్పులుగా.. అబద్ధాలను.. నిజాలుగా ప్రచారం చేసుకోవటం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకే చెందింది. సమాచారానికి సంబంధించి దినపత్రికలు రాజ్యమేలే రోజుల్లో ఎంట్రీ ఇచ్చిన న్యూస్ ఛానళ్లు.. ఎంతలా హడావుడి చేసేవో తెలిసిందే.కొందరు ప్రముఖులు చనిపోకున్నా.. చనిపోయారంటూ బ్రేకింగ్ న్యూస్ లు వేసేవి.
ఇప్పుడు వాటిని తలదన్నే పరిస్థితులు ఉన్నాయి. కొద్దిపాటి అనారోగ్యంతో వార్షిక పరీక్షల్లో భాగంగా ఆసుపత్రిలో ఉంటే.. ఐసీయూలో ఉన్నారంటూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మీద జరుగున్న ప్రచారంపై నిజానిజాలు కనుగొనే ప్రయత్నం చేయగా షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. గురువారం మధ్యాహ్నం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో ఒక పోస్టు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్ (జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే) తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని.. ఆయన పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని.. రెండు కిడ్నీలు చెడిపోయాయని.. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్లుగా ఆ పోస్టు పేర్కొంది.
సాయంత్రానికి కొన్ని వెబ్ పేపర్లలో ఇదే అంశం భారీ ప్రయారిటీ ఇస్తూ వార్తగా వండేశారు. ఇలాంటి వేళ.. మాగంటి గోపీనాధ్ ఆరోగ్యం గురించి ఆరా తీయగా.. ఆయన భేషుగ్గా ఉన్నారని.. కొన్ని పరీక్షల కోసం రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరితే.. రెండు వారాలుగా ప్రముఖ ఆసుపత్రిలో ఉన్నట్లుగా రాసేశారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. శుక్రవారం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వాస్తవం ఇలా ఉంటే.. వాట్సాప్ గ్రూపుల్లో మాత్రం ఆయన ఐసీయూలో ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారం షాకిచ్చేలా ఉందని చెప్పక తప్పదు.