మోడీ గెలుస్తూ పోతున్నారు...రూపాయి తగ్గుతూ పోతోంది !

భారత దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తోంది. ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫలానా వారిని చూపించడం లేదు.

Update: 2025-02-11 03:31 GMT

భారత దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తోంది. ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫలానా వారిని చూపించడం లేదు. అంతా నరేంద్ర మోడీ పేరు మీదనే ప్రచారం సాగుతోంది. నరేంద్ర మోడీ చరిష్మా తగ్గ్గిందని విపక్షాలు భ్రమలు పడుతున్నాయని ఎన్నికల ఫలితాలు చూపిస్తూ వెక్కిరిస్తున్నాయి.

కమల వికాసం అలా జరుగుతూ పోతోంది. మోడీ నాయకత్వంలో బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని గెలుచుకుని దేశాన్ని కాషాయ భారతంగా మారుస్తోంది. బీజేపీ గెలుపు ఖాయమన్న భావనకు అంతా వచ్చేస్తున్నారు. పోటీలు నామమాత్రం అవుతున్నాయి. గెలుపు అన్నది బీజేపీకి ఆనవాయితీగా మారుతోంది.

ఎమర్జెన్సీ తరువాత దేశానికి నచ్చిన ఒకే ఒక నాయకురాలుగా ఇందిరాగాంధీ ఉన్నారు. ఆ తరువాత ప్రధానులు అయిన వారిలో వాజ్ పేయ్ ప్రజాదరణ మెండుగా ఉన్నా ఆయన సైతం బీజేపీకి మెజారిటీ సాధించిపెట్టలేకపోయారు. అయితే నరేంద్ర మోడీ బీజేపీని రెండు సార్లు పూర్తి స్థాయి మెజారిటీతో గెలిపించడమే కాకుండా ఎన్డీయే మిత్రులను దగ్గర చేసుకుని మూడోసారి ప్రధాని అయ్యారు. అంతే కాదు అనేక రాష్ట్రాలలో ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తు చేస్తూ కమల వికాసానికి దారులు వేస్తునారు.

ఇందిరాగాంధీ తరువాత అంతలా దేశానికి నచ్చే నేతగా మోడీ నిలిచారు. మరి మోడీ పాలనలో ఏమి జరిగింది ఏఏ వర్గాలు సంతోషంగా ఉన్నాయి అంటే జవాబు ఎవరికి వారే చెప్పుకోవాలి. దేశంలో ద్రవ్యోల్బనం స్థాయిలు పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బనం పెరిగింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిరుద్యోగం అలాగే పెరుగుతోంది. ఇక జీడీపీ కూడా తగ్గుతోంది అని ఆర్ధిక సర్వేలు చెబుతున్నాయి. మరో వైపు రూపాయి డాలర్ తో పోటీ పడలేక విలవిలలాడుతోంది. అయినా సరే మోడీ గెలుస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 10న ప్రారంభ వాణిజ్యంలో అమెరికా డాలర్‌తో రూపాయి 45 పైసలు క్షీణించి రికార్డు స్థాయిలో 87.95 స్థాయికి చేరుకుంది, విదేశీ మార్కెట్‌లో అమెరికన్ కరెన్సీ బలం దేశీయ ఈక్విటీలలో ప్రతికూల ధోరణిని చూపించింది. రూపాయి చూస్తే గరిష్టంగా క్షీణిస్తోంది. దాంతో చెల్లని రూపాయిగా మారిపోతోంది. ఇదంతా భారతదేశ ఆర్ధిక స్థితిని సూచిస్తోంది అని అంటున్నారు.

ఇక వెనక్కి వెళ్ళి చూస్తే 2014లో నరేంద్ర మోడీ దేశానికి తొలిసారి ప్రధాని అయినపుడు రూపాయి విలువ డాలరు తో పోలిస్తే 59.44 ఉండేది. అది 2015లో 62.30 గా ఉంది. 2016లో 67.63గా ఉంది. 2018లో

74.00 గా ఉంది. 2021లో 76.31గా ఉంది. 2022లో 81.16గా, 2023లో 83.21గా ఉంది. 2024లో 84.80గా ఉంటే 2025 జనవరి 6వ తేదీ నాటికి 85.61గా ఉంది.

గత పదేళ్ళలో దాంతో డాలర్ ముందు రూపాయి ఎంతలా బక్కచిక్కిందో అర్థం చేసుకోవచ్చు అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. భారతీయ కరెన్సీ విలువ అమెరికా డాలర్ కంటే ఎపుడూ తక్కువగా ఉంటుంది. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947లో అది 3.30గా ఉంది. అలా 1975 నాటికి వచ్చేదాకా 8.39 గా ఉండేది.

అయితే దేశంలో ఆర్ధిక విధానాలతో పాటు ఇతర అనేక అంశాలు రూపాయి విలువలను డాలరు ముందు నిర్ణయిస్తాయి. అలా చూస్తే కనుక గతంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పడిపోతోంది అని అంటున్నారు. విదేశాలకు వెళ్లే చాలా మంది భారతీయ కరెన్సీని అమెరికా డాలర్ గా మార్చుకుంటారు.

యుఎస్ డాలర్ అంతర్జాతీయ వాణిజ్యం మారకంలో ఎక్కువ భాగం ఈ కరెన్సీని ఉపయోగించి విలువైనదిగా పరిగణించబడే స్థాయిలో ఉంది. డాలర్ విలువ చాలా దేశాల కరెన్సీల కంటే ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అయితే కువైట్ దినార్, బహ్రెయిన్ దినార్, బ్రిటీష్ పౌండ్ యూరో వంటి కొన్నిదేశాల కరెన్సీల విలువలు అమెరికా డాలర్ కంటే ఎక్కువ విలువ కలిగి ఉంటాయి. భారత కరెన్సీ మాత్రం మరీ దారుణంగా డాలర్ ముందు వెలవెల పోవడమే చిత్రాతిచిత్రం. అయినా కాషాయం పార్టీ దేశ ప్రజలకు బాగా నచ్చుతోంది. అదే విచిత్రంగా ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News