రూపాయి-రూబుల్.. భాయిభాయీ.. యుద్ధంలోనూ మరింత బలమైన బంధం
ఈ నేపథ్యంలోనే భారత్ సహా మరిన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈయన పుతిన్ కు సన్నిహితుడు.
ఈనాటి అనుబంధం ఏనాటిదో..? అనేది పాత తెలుగు సినిమాలోని ఓ పాట.. ఇదే పాట సరిగ్గా రష్యా –భారత్ అనుబంధానికీ వర్తిస్తుంది.. భారతీయులను, భారత సినిమాలను రష్యన్లు అమితంగా ఇష్టపడతారు. బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ సినిమాలంటే రష్యన్లు ఒకప్పుడు చెవికోసుకునేవారు. అయితే, అలాంటి రష్యాతో కొన్నేళ్ల కిందట భారత సంబంధాలు తగ్గాయి. యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా (యూఎస్ఎస్ఆర్) పతనం తర్వాత ఇరు దేశాల సంబంధాల్లో స్తబ్ధత నెలకొంది. ఆ లోటును పుతిన్ హయాంలో కొంత పూడ్చారు. ఇక ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ వైఖరి ఏమిటి? అని చాలా ఆసక్తికరంగా చూశారు. దీనికి సమాధానంగా భారత్ తమది శాంతి పక్షం అని సమాధానం ఇచ్చింది.
పశ్చిమంతో కచ్చి పుతిన్ 25 ఏళ్లుగా రష్యాను తన నియంత్రణలో ఉంచుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే అమెరికా ఏకస్వామ్య వ్యవస్థను ఢీ కొట్టగలిగేది పుతిన్ సారథ్యంలోని రష్యా మాత్రమే. అందుకే ఆయనకు స్వదేశంలోనూ విపరీతమైన మద్దతు ఉంది. ఇక ఉక్రెయిన్ పై యుద్ధం మొదలయ్యాక పశ్చిమ దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. వీటిని తట్టుకుంటూ కూడా రష్యా ఆర్థిక వ్యవస్థ నిలవగలిగింది. కాగా, పశ్చిమ దేశాలపై తమకు నమ్మకం పోయిందని రష్యా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరి గెరిసిమోవ్ అన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ సహా మరిన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈయన పుతిన్ కు సన్నిహితుడు. భారత్ తో పాటు మరిన్ని దేశాలతో బలమైన సంబంధాల కోసం చూస్తున్నట్లు పేర్కొన్నారు.
అమెరికానే కుట్రదారు..
ప్రపంచంలో సంఘర్షణలకు కారణం అమెరికా అని గెరిసిమోప్ నిందించారు. ప్రచ్ఛన్న యుద్ధ ఆయుధ నియంత్రణ ఒప్పందాలను కూడా అమెరికా బలహీనం చేస్తోందని మండిపడ్డారు. ఆయుధాల నియంత్రణపై ఏ ఒప్పందానికైనా పశ్చిమ దేశాల ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని, అందుకే పశ్చిమ దేశాలపై నమ్మకం పోయిందని పేర్కొన్నారు. చైనా, భారత్, ఇరాన్, ఉత్తర కొరియా, వెనెజువెలాలతో బలమైన బంధం పెంచుకుంటామని తెలిపారు. నమ్మకం లేకుండా పరస్పర నియంత్రణ కోసం సమర్థవంతమైన యంత్రాంగాన్ని సృష్టించడం అసాధ్యంగా పేర్కొన్నారు.
కాగా, తమతో పాటు పశ్చిమదేశాలకు రష్యా, చైనా ఎప్పటికైనా ప్రమాదకరంగా మారతాయని అమెరికా భావన. ఉక్రెయిన్ కు అమెరికా మద్దతుగా నిలుస్తుండడమే కాక.. భారీగా ఆయుధాలను అందిస్తోంది. అసలే అంతంతమాత్రంగా ఉండే రష్యా-అమెరికా సంబంధాలు దీంతో మరింత దెబ్బతిన్నాయి.