పుట్టేది ఒకరు.. గిట్టేది ఎందరో?.. అతిపెద్ద దేశంలో జన సంక్షోభం
కానీ, రష్యా జనాభా 15 కోట్లకు కాస్త ఎక్కువ అంతే. ఇపుడు అదే పెద్ద సమస్యగా మారిందట. కొన్నేళ్లుగా జనన-మరణాల్లో వ్యత్యాసం భారీగా పెరుగుతూ పోతోందని స్పష్టమైంది.
15 ముక్కలుగా విడిపోయాక కూడా అది వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశం.. ఆ దేశం నుంచి వేరుపడిన భాగాలే చాలా పెద్ద దేశాలుగా ఉన్నాయి. అంతెందుకు..? ప్రపంచంలోని ఐదో అతిపెద్ద దేశం కంటే ఈ దేశం మూడు రెట్లకు పైగా పెద్దది. ఇక ఆయుధాల పరంగానూ మహా శక్తి. అలాంటి దేశం ఇప్పుడు ఓ కొత్త సంక్షోభం ఎదుర్కొంటోంది. భూమికి కొరత లేదు.. సహజ వనరులకు కొదవ లేదు.. ఆర్థికంగానూ ఫర్వాలేదు.. కానీ, ఆ అంశంలో మాత్రం ఆందోళన చెందుతోంది.
నెలకు లక్ష కంటే తక్కువేనట..రష్యా వైశాల్యం 17,098,242 చదరపు కిలోమీటర్లు. ఇది 150 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత దేశానికి ఐదు రెట్లు. కానీ, రష్యా జనాభా 15 కోట్లకు కాస్త ఎక్కువ అంతే. ఇపుడు అదే పెద్ద సమస్యగా మారిందట. కొన్నేళ్లుగా జనన-మరణాల్లో వ్యత్యాసం భారీగా పెరుగుతూ పోతోందని స్పష్టమైంది. ఇదేమీ ప్రైవేటు సంస్థల డేటా కాదు.. ప్రభుత్వ డేటానే. కాగా, రష్యాలో ఈ జూన్ వరకు 5,99,600 మంది పుట్టారు. ఇది గత ఏడాది జూన్ కంటే 16 వేలు తక్కువ కావడం గమనార్హం. ఈ జూన్‌లో జననాలు లక్ష కూడా లేవట. ఇది ఆరు శాతం తగ్గుదలగా చెబుతున్నారు. 25 ఏళ్ల నుంచి తగ్గుదల కనిపిస్తున్నా.. ఇప్పుడు మరీ బెంగ కలుగుతోంది ఎందుకంటే..?
6 నెలల్లో 3.25 లక్షల మరణాలు జనవరి నుంచి జూన్ మధ్య రష్యాలో మరణాల సంఖ్య 3,25,100. అయితే, నిరుటి కంటే ఇవి 49 వేలు అధికం. ఇంకాస్త ఊరట ఏమంటే.. రష్యాకు వలస వచ్చినవారి జనాభా 20 శాతం కావడంతో జనాభా క్షీణత కాస్త ఆగింది. కాగా, ఉక్రెయిన్ తో రెండున్నరేళ్లుగా రష్యా యుద్ధం సాగిస్తోంది. ఇందులో భారీగా సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా జనన-మరణాల్లో అంతరానికి కారణం అని అంటున్నారు. యుద్ధంలో 15వేల మంది రష్యా సైనికులు చనిపోయారని కథనాలు వస్తున్నా.. రష్యా ఖండిస్తోంది.
ఇది విపత్తే.. పిల్లలను కంటే నజరానా దేశంలో జననాలు తగ్గడాన్ని.. అధ్యక్ష నివాసం క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అంటున్నారు. రష్యా దిగువ సభ డూమాలో.. కుటుంబాల రక్షణ కమిటీ అధిపతి నినా ఒస్టానినా కూడా జననాల రేటు తగ్గుదలను ప్రస్తావించి ఆందోళన వ్యక్తంచేశారు. 'ప్రత్యేక జనాభా ఆపరేషన్' చేపట్టాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. కాగా, సోవియట్ యూనియన్ హయాంలో ఓ నిబంధన ఉండేది. ఎంత ఎక్కువమంది పిల్లలను కంటే అంత ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ 2002లో దీనిని పునరుద్ధరించారు. పది అంతకంటే ఎక్కువమందిని కంటే మహిళలకు మిలియన్ రూబెల్స్ (రూ.13లక్షలకు పైన) డబ్బులు, 'మదర్ హీరోయిన్' అవార్డు ఇస్తామని ప్రకటించారు. కానీ, 10వ బిడ్డ మొదటి పుట్టిన రోజున ఇస్తామనడం, అంతకుముందు పుట్టిన 9 మంది పిల్లలు కూడా బతికి ఉండాలనడంతో పెద్దగా స్పందన రాలేదు.