షాకింగ్ లెక్కలు... రష్యా సైనికులు అంత మంది మరణించారా?
ఈ సందర్భంగా అందుబాటులో ఉంటే.. సదరు సైనికుడి ఫోటోలను కూడా ప్రచురించింది.
సుమారు మూడేళ్లుగా రష్యా – ఉక్రెయిన్ వార్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మొదలైన ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం ఆయిపోయింది కానీ.. ఆ ఇరు దేశాల మధ్య యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ యుద్ధం మొదలై మూడేళ్లు అయ్యింది! ఈ సందర్భంగా రష్యా సైనికుల మరణాలపై షాకింగ్ లెక్కలు తెరపైకి వచ్చాయి.
అవును... అవిరామంగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తమ దేశంలోని సైనికుల మరణాలపై రష్యన్ స్వతంత్ర వార్తా సైట్ మీడియజోనా ఓ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... ఉక్రెయిన్ తో పోరాడుతు 1,65,000 మంది సైనికులు మరణించారని తెలిపింది. ఇందులో 95,000 మంది సైనికుల వివరాలను పేర్లతో సహా వెల్లడించింది.
తాజగా మీడియాజోనా తన కథనంలో కీలక విషయాలు వెల్లడించింది. ఉక్రెయిన్ తో యుద్ధం మొదలై మూడేళ్లైన సందర్భంగా సైనికుల మరణాలకు సంబంధించిన ఫోటోలు, అధికారిక సమాచారంతో కూడిన వివరాలు వెల్లడించింది. ఈ సందర్భంగా... సైనికుడి వయసు, మరణించిన తేదీ, అతడు పని చేసిన యూనిట్, మరణించిన ప్రాంతం మొదలైన వివరాలు ఆ కథనంలో పొందుపరిచింది.
ఈ సందర్భంగా అందుబాటులో ఉంటే.. సదరు సైనికుడి ఫోటోలను కూడా ప్రచురించింది. తమ విశ్లేషణ ప్రకారం.. 2022లో సుమారు 20,000 మంది సైనికులు.. 2023లో సుమారు 50,000 మంది మరణించగా.. 2024లో ఏకంగా లక్ష మంది చనిపోయారని వెళ్లడించింది. అందువల్లే ఈ యుద్ధంలో 2024 ని అత్యంత రక్తసిక్త సంవత్సరమని పేర్కొంది. 2025లో ఇప్పటివరకూ 393 మంది మరణించారని తెలిపింది.
అయితే... ఈ షాకింగ్ కథనంపై రష్యా ప్రభుత్వం స్పందించలేదు. దీనిగురించి ప్రస్థావించగా.. ఆ ప్రచురణ గురించి తమకు తెలియదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి అన్నారు. ఈ సందర్భంగా... సైనికుల మరణాలకు సంబంధించిన వివారాలు నిజమో కాదో తనకు తెలియదని.. ఈ సమాచారం రక్షణ మంత్రిత్వ శాఖ వద్ద ఉంటుందని.. అది వారి హక్కని అన్నారు.
కాగా... మీడియాజోనాను రష్యన్ ప్రతిపక్ష కార్యకర్త ప్యోటర్ వెర్జిలోవ్ స్థాపించారు. అయితే... దీన్ని రష్యా ప్రభుత్వం "విదేశీ ఏజెంట్"గా ప్రకటించింది. వెర్జిలోవ్ ను తీవ్రవాదుల జాబితాలో చేర్చింది. మరోపక్క... రష్యాతో యుద్ధంలో తమ సైనికులు 46,000 మందికి పైగా మరణించారని ఉక్రెయిన్ తెలిపింది. ఇదే సమయంలో సుమారు 3.80 లక్షల మంది గాయపడ్డారని ప్రకటించింది.