చంద్రబాబుకు ఎప్పుడు మతిపోతుందో ఎవరికి తెలుసు : సచిన్
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు చంద్రబాబు మనసు మారొచ్చు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ వెన్నుపోటు పొడవచ్చంటూ సచిన్ జోస్యం చెప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తున్న చంద్రబాబుకు ఎప్పుడు మతిపోతుందో ఎవరికి తెలుసంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు చంద్రబాబు మనసు మారొచ్చు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ వెన్నుపోటు పొడవచ్చంటూ సచిన్ జోస్యం చెప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మంచి, చెడు రెండూ ఉంటాయని సచిన్ వ్యాఖ్యానించారు. కాలం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మనసు ఎప్పటికప్పుడు మారుతుంటుంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ వెన్నుపోటు రాజకీయాలు అందరికీ తెలిసినవేనని సచిన్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ 240 సీట్లకే పరిమితమైందని గుర్తు చేశారు. చంద్రబాబు, నితీశ్ కుమార్ ఎప్పుడు హ్యాండిస్తారో తెలియదని సచిన్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం అని భావించకూడదని సూచించారు. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని, ఈలోగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయని విశ్వాసం తమకుందని అన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వైఖరిపై చాలా విమర్శలు చేశారని, అయితే ఆయన మరణాంతరం మన్మోహన్ గొప్పతనం దేశవ్యాప్తంగా తెలిసిందని చెప్పారు. ఇక దేశంలో ప్రజా ఉద్యమాలపై యువత ఆసక్తి చూపడం లేదని, ఇప్పుడు ఆందోళనలు అన్నీ సోషల్ మీడియాకే పరిమితమవుతున్నాయని సచిన్ వ్యాఖ్యానించారు. గతంలో వలే ఎవరూ వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయడం లేదన్నారు.