బీజేపీకి మాజీ ముఖ్యమంత్రి షాకివ్వబోతున్నారా..?
కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ్... బెంగళూరు నార్త్ టిక్కెట్ ఆశించారు.
ఎన్నికలు సమీపిస్తున్నాయి.. సీట్ల కేటాయింపుల్లో అన్ని పార్టీలూ తలమునకలవుతున్నాయని అంటున్నారు. ఇక పొత్తులు ఉన్న చోట అయితే ఈ తలపోట్లు రెట్టింపు అని చెబుతూ.. ఏపీలో పరిస్థితి ఉదాహరణగా చూపిస్తున్న పరిస్థితి! ఈ నేపథ్యంలో ఎంపీ టిక్కెట్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి.. ఇప్పుడు బీజేపీ పెద్దలను టెన్షన్ పెడుతున్నారని, ఈ సమయంలో అధికార కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపిందని తెలుస్తుంది. దీంతో... సదరు మాజీ ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుండగా... ఇప్పటికే అధికారానికి దూరమై పదేళ్లు అవ్వడంతో.. ఈ సారి ఎలాగైనా కుర్చీ ఎక్కాలని కాంగ్రెస్ భావిస్తుందని చెబుతున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా వీలైనన్ని ఎక్కువ లోక్ సభ స్థానాల్లో గెలవాలని భావిస్తున్న బీజేపీకి.. సీట్ల సర్దుబాటు అంశం పెను సమస్యగా మారిందని అంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడతో సరికొత్త సమస్య తెరపైకి వచ్చిందని తెలుస్తుంది.
వివరాళ్లోకి వెళ్తే... కర్ణాటక రాష్ట్రంలో 20 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో బీజేపీలో రచ్చ మొదలైంది! ఇందులో భాగంగా బెంగళూరు నార్త్ లోక్ సభ నియోజకవర్గం టిక్కెట్ దక్కకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ.. బీజేపీ హైకమాండ్ కు సమస్యగా మారారని తెలుస్తుంది. పైగా... ఆయన అసంతృప్తిగా ఉన్నారని తెలియడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆయనకు టచ్ లోకి వెళ్లారని తెలుస్తుండటంతో.. బీజేపీలో మరింత టెన్షన్ మొదలైందని అంటున్నారు.
కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ్... బెంగళూరు నార్త్ టిక్కెట్ ఆశించారు. ఈ సమయంలో ఆ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన పక్కచూపులు చూస్తున్నారని కథనాలొస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ హైకమాండ్.. ఆయనకు చిక్కబళ్లాపూర్ లోక్ సభ నియోజకవర్గం టిక్కెట్ ఇస్తామని బుజ్జగిస్తుందని అంటున్నారు. అయితే అందుకు ఆయన అంత సానుకూలంగా లేరని అంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్... ఆయనకు మైసూరు లోక్ సభ టిక్కెట్ ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు.
దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర... సదానంద గౌడతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే... చిక్కబళ్లాపూర్ విషయంలో సదానందగౌడ్ మాత్రం ఆసక్తిగా లేరని.. అందుకు ఆయన అంగీకరించడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తన నిర్ణయం ప్రకటిస్తానని బెంగళూరు ఉత్తర లోక్ సభ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సదానంద గౌడ్ ప్రకటించారు.
దీంతో... బీజేపీలో టెన్షన్ పెరిగిందని, ఇంతటి సీనియర్ నేత ఈ సమయంలో పార్టీని వీడితే సమస్యలు వస్తాయని భావిస్తున్నారని తెలుస్తుంది. మరోపక్క సదానంద గౌడ్ కు ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తుందంట కాంగ్రెస్ పార్టీ! దీంతో... సదానంద గౌడ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? బీజేపీ పెద్దల బుజ్జగింపులకు చల్లబడతారా? లేక, కాంగ్రెస్ గూటికి చేరతారా? అనేది వేచి చూడాలి!!