తెలంగాణ కుంకమ పువ్వు.. అదెలా సాధ్యం? తెలిస్తే ఆశ్చర్యమే
అయితే.. కశ్మీర్ కుంకుమ పువ్వు స్థానంలో తెలంగాణ కుంకుమపువ్వు అన్న మాట త్వరలో రానుంది.
కుంకుమపువ్వు అన్నంతనే కశ్మీర్ గుర్తుకు వస్తుంది. సుగంధ ద్రవ్యాల్లో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా కుంకుమపువ్వును చెబుతారు. అలాంటి కుంకుమ పువ్వును కశ్మీర్ లో ప్రత్యేకంగా పండిస్తారు. అయితే.. కశ్మీర్ కుంకుమ పువ్వు స్థానంలో తెలంగాణ కుంకుమపువ్వు అన్న మాట త్వరలో రానుంది. ఇప్పటికే ఉత్పత్తి మొదలై కుంకుమపువ్వు రాబోయే రోజుల్లో మరింత భారీగా ఉత్పత్తి జరిగితే.. తెలంగాణ కుంకుమపువ్వు పేరుతో మార్కెట్లో లభించనుంది. సాధారణంగా కుంకుమపువ్వు పంట చలి ప్రదేశాల్లో పండిస్తారు కదా? మరి.. తెలంగాణలో ఎలా సాధ్యమంటే.. ఆసక్తికర అంశం వెలుగు చూసింది.
సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లిలోని డీఎక్స్ ఎన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ కుంకుమపువ్వును పండించే ఏర్పాట్లు చేయటమే కాదు.. తొలి విడతలో 200 గ్రాముల వరకు కుంకుమ పువ్వును ఉత్పత్తి చేశారు. ఇందుకోసం ఏరో ఫోనిక్ విధానంలో గత ఏడాది జులైలో కుంకుమ పువ్వు పంటను పండించటం షురూ చేశారు.
సుమారు 600 అడగుల చదరపు విస్తీర్ణంలో ఉన్న కోల్డ్ స్టోర్ రూంలో ఉష్ణోగ్రత కనిష్ఠంగా 3 డిగ్రీలు.. గరిష్ఠంగా 18 డిగ్రీలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కశ్మీర్ నుంచి కిలో 800 రూపాయిల చొప్పున 900 కేజీల కుంకం పువ్వు మొక్కల్ని తెప్పించారు. మొత్తం పది ర్యాకుల్లో అమర్చారు. ఒక్కో మొక్క 3 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఏడేళ్ల వరకు మొక్కల్ని బతికించుకునే వీలుంది.
ప్రతి చలికాలంలో ఒక మొక్కకు మూడు నుంచి నాలుగు పువ్వులు పూస్తాయి. ఇలా ఇప్పటివరకు 200 గ్రాముల కుంకమపువ్వును సేకరించారు. మరో 400 గ్రాముల కుంకుమ పువ్వు రానున్నట్లు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో కుంకుమ పువ్వును సేకరించిన తర్వాత మార్కెట్లోకి వస్తామని సంస్థ చెబుతోంది. అదే జరిగితే.. కశ్మీర్ కుంకుమ పువ్వు మార్కెట్లోకి వచ్చేస్తుందని చెప్పాలి. కశ్మీరీ కుంకుమపువ్వు స్థానే తెలంగాణ కుంకుమ పువ్వు.. తెలుగువారికి ఇంతకు మించి కావాల్సిందేముంది చెప్పండి.