ఆ భూములు స్వాధీనం చేసుకోండి.. సహకరిస్తా: సాయిరెడ్డి
ఒకవేళ ప్రభుత్వమే ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని భావిస్తే.. తాను పూర్తిగా సహకరిస్తా నని చెప్పారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి బిగ్ ఆఫర్ ప్రకటించారు. విశాఖపట్నంలో వివాదంగా ఉన్న దసపల్లా భూములను తన కుటుంబానికి అంటగట్టడం సమంజసం కాదన్నారు. ఎన్సీసీ, దసపల్లా భూములతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వమే ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని భావిస్తే.. తాను పూర్తిగా సహకరిస్తా నని చెప్పారు. తనకు తెలిసిన సమాచారం అందిస్తానన్నారు.
ఈ మేరకు తాజాగా సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక, కూటమి పాలనపై ఆయన నిశిత విమర్శలు చేశారు. 100 రోజలు కూటమి పాలన ప్రజలను నానా తిప్పలు పెడుతున్నట్టు చెప్పారు. ఏదో చెబుతారు.. ఏదో చేస్తారు.. వారికైనా తెలియాలి కదా! అని వ్యాఖ్యానించారు. ఇసుక ఉచితం అంటూనే.. అమ్ముకుంటున్నా రని, దీనిలో ఎవరెవరున్నారో.. అందరికీ తెలిసిందేనని అయినా.. ఏమీ తెలియనట్టు.. చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
మద్యంలోనూ కుంభకోణాలు జరుగుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే మద్యం ప్లాన్ వికటించిందన్నారు. ఇంటికో.. బెల్ట్ షాప్ తయారైందని.. వీటిని టీడీపీ నాయకులు నిర్వహిస్తున్నారని సాయిరెడ్డి ఆరోపించారు. అయినా.. ఏమీ తెలియనట్టుగా అంతా బాగుందని చంద్రబాబు ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు కాకుండా.. ఆపగలగడంలో చంద్రబాబు విఫలమయ్యారని సాయిరెడ్డి చెప్పారు. కేంద్రంలో కూటమిలో కలిసినా.. ఆయన సాధించింది ఏమీ లేదన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ అధినేత జగన్ సహా తామంతా వ్యతిరేకమని సాయిరెడ్డి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకునేందుకు ఆమరణ నిరాహారదీక్ష చేయనున్నట్టు తెలిపారు. ఇక, జగన్ తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఉత్తరాంధ్రలో వైసీపీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు.