సైఫ్ దాడి కేసు: CCTV ఫుటేజ్ ర‌హ‌స్యం.. ముఖ గుర్తింపు ప‌రీక్ష‌

తాజా సమాచారం మేర‌కు.. ఫోరెన్సిక్ నిపుణులు నిందితుడి ముఖ గుర్తింపు ప‌రీక్ష‌ను నిర్వహించనున్నారు.

Update: 2025-01-25 04:07 GMT

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు అంత‌కంత‌కు వేడి పెంచుతోంది. ముంబై బాంద్రా నివాసంలో జరిగిన దోపిడీ ఘ‌ట‌న‌లో ఆరుసార్లు కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్ ని త‌న‌తో పాటే ఉన్న భార్య క‌రీనా క‌పూర్ ఎందుకు ఆస్ప‌త్రికి తీసుకుని వెళ్ల‌లేదు? అన్న ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తింది. దాడి స‌మ‌యంలో సైఫ్ కుమారుడు ఇబ్ర‌హీం అలీ ఖాన్ కాకుండా సైఫ్ ఖాన్ స్నేహితుడు, వ్యాపార భాగ‌స్వామి మాత్ర‌మే ఆస్ప‌త్రికి తీసుకుని వెళ్ల‌డంపైనా పోలీసుల్లో అనుమానాలు వ్యక్త‌మైన‌ట్టు మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి.

ఇదిలా ఉంటే, సైఫ్ పై దాడికి ప్ర‌య‌త్నించిన‌ బంగ్లాదేశ్ జాతీయుడైన నిందితుడిని థానే గుండా బంగ్లాదేశ్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజా సమాచారం మేర‌కు.. ఫోరెన్సిక్ నిపుణులు నిందితుడి ముఖ గుర్తింపు ప‌రీక్ష‌ను నిర్వహించనున్నారు. జనవరి 16న బాంద్రా నివాసంలో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసి అరెస్టయిన షరీఫుల్ ఫకీర్‌కు కలీనాలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో డిజిటల్ ముఖ గుర్తింపు పరీక్ష (ఎఫ్‌.ఆర్‌.టి) నిర్వహిస్తారు. షరీఫుల్ 6వ అంత‌స్తు నుండి 11వ అంతస్తుకు చేరుకుని, తెల్లవారుజామున 1:30 నుండి 2:30 గంటల మధ్య పారిపోతున్న సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన వ్యక్తితో సరిపోలుతున్నాడా లేదా? అని ధృవీకరించ‌డానికి ఈ పరీక్ష అవ‌స‌ర‌మ‌ని అధికారులు భావిస్తున్నారు.

స్పాట్ నుంచి రక్త నమూనాలు, బాధితుడు- నిందితుడి నుండి ర‌క్తంతో తడిసిన దుస్తులు, నేరస్థలం నుండి ఇతర ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. దర్యాప్తు అధికారులు నిందితుడి డ్రైవింగ్ లైసెన్స్, ఫోన్‌లో నిల్వ చేసిన బంగ్లాదేశ్ ఐడి కార్డులు, బంగ్లాదేశ్‌లోని అతడి కుటుంబానికి డబ్బు బదిలీల రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

సైఫ్ ఖాన్ నివ‌శించే బాంద్రా భవనంలోని సిసిటివి ఫుటేజ్‌లో రికార్డ్ అయిన‌ ముఖంతో ష‌రీఫుల్ ముఖం సరిపోలాల్సి ఉంద‌ని, విశ్లేషణ సమయంలో ఫోరెన్సిక్ పరీక్షకులు ముఖం మొత్తం ఆకారం, దాని నిర్మాణాన్ని పరిశీలిస్తారని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఈ పరీక్షలో నిందితుడి ముఖ లక్షణాలను వివిధ కోణాల నుండి విశ్లేషించి, అతడి గుర్తింపును నిర్ధారించడానికి ఇంటి లోపలి ఫుటేజ్ తో, ప‌లు చోట్ల నుండి వచ్చిన సిసిటివి ఫుటేజ్‌లను పోల్చి చూస్తారు. ఈ శుక్ర‌వారం నాడు విచార‌ణ‌లో షరీఫుల్ అధికారుల‌కు సహకరించలేదని తెలుస్తోంది. కోర్టు అతడి కస్టడీని 5 రోజులు పొడిగించింది. ఫోరెన్సిక్ టెస్ట్ కోసం అదనపు సమయం ఇచ్చింది.

అలాగే ఈ కేసులో ష‌రీఫుల్ తండ్రి శ్రీ రుహుల్ త‌న కుమారుడిని ర‌క్షించుకునేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తన కొడుకు విడుదల కోసం బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించి, ఢాకాలోని భారత హైకమిషన్ నుండి సహాయం కోరుతున్నాడ‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. తన కొడుకు అరెస్టు గురించి ఫేస్‌బుక్ , వార్తా ఛానెల్‌ల ద్వారా తెలుసుకున్నానని అత‌డి తండ్రి రుహుల్ వెల్లడించారు. ఈ విషయం గురించి అధికారులు ఎవ‌రూ తనను సంప్రదించలేదని ఆయ‌న‌ ఆవేద‌న చెందారు. ముఖ గుర్తింపు ప‌రీక్ష (ఫేసియ‌ల్ రిక‌గ్నిష‌న్ టెస్ట్) చేయ‌డానికి కార‌ణం దాడిలో పాల్గొన్న‌ది ఒక‌రా ఇద్ద‌రా? అనేది తేల్చ‌డానికేన‌ని కూడా కొంద‌రు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News