సైఫ్ కి మరో టెన్షన్!... తెరపైకి రూ.15,000 కోట్ల ఆస్తి మేటర్!
ఆ ప్యాలెస్ ను కేంద్రం స్వాధీనం చేసుకోవడానికి లైన్ క్లియర్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
వారం రోజుల క్రితం ముంబైలోని బాంద్రాలోని తన నివాసంలో కత్తిపోట్లకు గురై, తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కు సంబంధించిన మరో విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇది సుమారు రూ.15,000 కోట్ల విలువైన ఆస్తి వ్యవహారం కావడంతో ఇష్యూ వైరల్ గా మారింది.
అవును.. క్రికెట్ దిగ్గజం, రాజ కుటుంబానికి చెందిన నవాబ్ పటౌడీ - షర్మిలా ఠాగూర్ దంపతుల కుమారుడైన సైఫ్ అలీ ఖాన్ కు భారీగా కుటుంబ ఆస్తులు ఉన్నాయి. వీటిలో మధ్యప్రదేశ్ లో భోపాల్ లోని పటౌడీ ప్యాలెస్ అత్యంత కీలకమైనదని చెబుతారు. అయితే.. దీని యాజమాన్యంపై 2015 నుంచి కొనసాగుతున్న స్టేను ఎంపీ హైకోర్టు తాజాగా ఎత్తి వేసింది.
దీంతో.. ఆ ప్యాలెస్ ను కేంద్రం స్వాధీనం చేసుకోవడానికి లైన్ క్లియర్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వీటిలో ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, సైఫ్ తన బాల్యాన్ని గడిపిన నూర్ ఉస్ సబా ప్యాలెస్, హబీబీ బంగ్లా, అహ్మదాబాద్ ప్యాలెస్, కోహెఫిజా ప్రాపర్టీతో పాటు అనేక ఇతర అత్యంత విలువైన ఆస్తులు ఉన్నట్లు చెబుతున్నారు.
శత్రువుల ఆస్తుల స్వాధీన చట్ట ప్రకారం మధ్యప్రదేశ్ లోని పటౌడీ కుటుంబానికి ఉన్న ఇలాంటి ఆస్తులన్నింటి విలువ సుమారు రూ.15,000 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. వాస్తవానికి 1968 నాటి ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం పాకిస్థాన్ విభజన తర్వాత భారతీయులు విదేశాలకు వెళ్లిపోతే వారి అస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
అయితే ఈ చట్టానికి 2017లో సవరణలు కూడా చేశారు. ఇందులో భాగంగా... ఈ విషయంలో భారత్ లోనే ఉన్న వారి వారసులకు అభ్యంతరాలు ఉంటే వాటిని తెలియజేస్తూ 30 రోజుల్లోగా అపీల్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే... ఇప్పుడు సైఫ్ అలీఖాన్ ఈ రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులపై హైకోర్టూ ఇచ్చిన ఉత్తర్వ్యులను సవాల్ చేయాల్సి ఉందన్నమాట.
ఈ సందర్భంగా జస్టిస్ వివేక్ అగర్వాల్ ఉత్తర్యులు వెల్లడిస్తూ... నేటి నుంచి 30 రోజుల్లోగా అభ్యంతరాలను వెల్లడించాలని అన్నారు! ఈ నేపథ్యంలో సైఫ్ అలీఖాన్ తీసుకోబోయే నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
కాగా... భోపాల్ చివరి నవాబు అయిన హమీదుల్లా ఖాన్ కు ముగ్గురు కుమార్తెలు కాగా... వారిలో పెద్ద కుమర్తె అబిదా సుల్తాన్ 1950లో పాకిస్థాన్ కు వలస వెళ్లిపోయారు. అతని రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ మాత్రం ఇండియాలోనే ఉండిపోయారు. ఈ క్రమంలో ఆమె నవాబ్ ఇఫీకర్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకుని చట్టబద్ధమైన వారసురాలు అయ్యారు.
ఆ సాజిదా సుల్తాన్ మనవడు అయిన సైఫ్ అలీఖాన్ ఆ ఆస్తుల్లో కొంత భాగాన్ని వారసత్వంగా పొందారు. ఈ సమయంలో... అబిదా సుల్తాన్ మాత్రం పాకిస్థాన్ కు వెళ్లడం అనేది ఆస్తులను శత్రువు ఆస్తిగా వర్గీకరించాలనే ప్రభుత్వ వాదనగా మారింది. అయితే.. 2019లో కోర్టు సాజిదా సుల్తాన్ ను చట్టబద్దమైన వారసురాలిగా గుర్తించడంతో దీనిపై సైఫ్ పొరాడాల్సి ఉందని అంటున్నారు!