అగంతకుడు సైఫ్ ఇంట్లో హౌస్ కీపింగ్ వర్కర్?
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన అగంతకుడిని థానేలో పోలీసులు అరెస్ట్ చేయగా, ముంబైకి క్రైమ్ బ్రాంచి పోలీసులు తరలిస్తున్నారని కథనాలొచ్చాయి.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన అగంతకుడిని థానేలో పోలీసులు అరెస్ట్ చేయగా, ముంబైకి క్రైమ్ బ్రాంచి పోలీసులు తరలిస్తున్నారని కథనాలొచ్చాయి. అతడి పేరు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (30). కానీ పేరు మార్చుకున్నాడు. అతడు బంగ్లాదేశీ. అక్రమంగా భారత్‌లో నివశిస్తున్నాడు. పట్టుబడిన సమయంలో రైల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు.
స్టార్ హీరోపై దాడి చేసిన అతడికి అంతకుముందే ఆ భవంతి గురించి అణువణువు తెలుసునని తాజా కథనాలు వెల్లడిస్తున్నాయి. అతడు గతంలో సైఫ్ ఇంటికి వెళ్ళాడని, ఒక హౌస్ కీపింగ్ సంస్థలో పనిచేశాడని సోర్స్ చెబుతోంది. సైఫ్ ఇంటి పనివాడైన హరి క్లీనింగ్ కోసం అతడిని ఓసారి బంగ్లాకు తీసుకుని వచ్చాడని కూడా ముంబై మీడియా కథనాలు వెలువరించింది.
విజయ్ దాస్, బిజోయ్ దాస్, మొహమ్మద్ ఇలియాస్, బిజె అనే పేర్లతో అతడు ముంబైలో, అలాగే భారతదేశంలో తిరుగుతున్నాడు. ఆదివారం ఉదయం మహారాష్ట్ర- థానేలోని హిరానందాని ఎస్టేట్‌లోని మెట్రో నిర్మాణ స్థలం సమీపంలోని లేబర్ క్యాంప్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
సైఫ్‌ను తన బాంద్రా అపార్ట్‌మెంట్‌లో అతడు కత్తి పోట్లు పొడిచాడు. దొంగతనం కోసం వచ్చి అతడు ఈ దురాగతానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. ఆరోజు అసలేం జరిగింది? అన్నది ఆరా తీస్తే....జనవరి 16న సెక్యూరిటీ గార్డు నిద్రపోతున్నట్లు గమనించిన నిందితుడు 11వ అంతస్తుకు ఎక్కాడు. 11వ అంతస్తుకు చేరుకున్న తర్వాత అతడు డక్ట్ షాఫ్ట్‌లోకి ప్రవేశించి సైఫ్ ఖాన్ ఉంటున్న ఫ్లాట్‌లోకి ప్రవేశించాడు. డక్ట్ అతడిని నేరుగా సైఫ్ పిల్లలు నిదురిస్తున్న గదికి దగ్గరగా తీసుకువచ్చింది. అక్కడ అతడు బాత్రూంలో దాక్కున్నాడు.
గతంలో షెహజాద్ వర్లిలో నివశించాడు. సంఘటన జరిగిన రోజు థానేకు రైలులో వెళ్ళాడు. థానేలో బైక్‌పై ఒక వ్యక్తి అతడిని తీసుకెళ్లడానికి వచ్చాడు. బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో పోలీసులు జనవరి 18న ఘోడ్‌బందర్‌కు వెళుతున్న అతడిని ట్రాక్ చేసి చివరికి అరెస్టు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీస్ డీసీపీ దీక్షిత్ గెడమ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అలియాస్ బిజోయ్ దాస్ దోపిడీ చేయాలనే ఉద్దేశ్యంతో సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడని, కోర్టులో హాజరుపరుస్తామని ఆయన తెలిపారు.
అతడు బంగ్లాదేశ్ నుండి వచ్చాడని అనుమానిస్తున్నాం కాబట్టి ఎఫ్.ఐ.ఆర్ సెక్షన్లను సవరించాం. నిందితుడు బంగ్లాదేశ్ జాతీయుడని తెలిపే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. అతని వద్ద చెల్లుబాటు అయ్యే భారతీయ పత్రాలు లేవు. అతడు విజయ్ దాస్ అనే మారుపేరుతో ముంబైలో తిరుగుతున్నాడు.. అని కూడా పోలీసులు చెబుతున్నారు.
నిందితుడు 5-6 నెలల క్రితం ముంబైకి వచ్చాడని, హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దాడికి ముందు సైఫ్ ఖాన్ ఇల్లు అతడికి తెలుసునని కూడా కథనాలొస్తున్నాయి.