‘ఆంధ్రుల హక్కు’కు శుభవార్త!

కేంద్రం నిర్ణయంపై వివిధ రాజకీయ పార్టీలు, స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు.

Update: 2024-09-28 07:32 GMT

‘ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు’ నినాదంతో అప్పట్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను రాష్ట్ర ప్రజలు నిలుపుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ కర్మాగారాలన్నీ వరుసగా ప్రైవేటీకరణ అవుతున్న నేపథ్యంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను కూడా ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంపై వివిధ రాజకీయ పార్టీలు, స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. టీడీపీ, జనసేన మద్దతుపైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటీకరించొద్దనే ఈ రెండు పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌)ను మరో కేంద్ర ప్రభుత్వ కర్మాగారం.. సెయిల్‌ (స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌)లో కలపాలని కేంద్రం భావిస్తోందని సమాచారం.

ప్రస్తుతం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆర్థికంగా నష్టాల్లో ఉంది. కొద్ది రోజుల క్రితం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు ఉన్న భూములను విక్రయించుకోవచ్చని ప్లాంట్‌ కు ఏపీ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇదిలా ఉండగా సెయిల్‌ లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను విలీనం చేసే యోచనలో కేంద్రం ఉంది. ఇదే జరిగితే స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులకు, ఏపీ ప్రజలకు శుభవార్తేనని అంటున్నారు.

సెయిల్‌ కూడా ప్రభుత్వ రంగ సంస్థే కావడంతో అందులో విలీనమైనా ప్రైవేటీకరణ అనే ఊసు తలెత్తదు. ఆర్థికంగా, నిర్వహణపరంగా నష్టాలను ఎదుర్కొంటున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను ఈ కష్టాల నుంచి బయటపడేయడానికి సెయిల్‌ లో విలీనం చేయడం ఒక ప్రత్యామ్నాయమని కేంద్రం భావిస్తోంది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూములను నేషనల్‌ మైనింగ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ కు అమ్మడంతోపాటు, బ్యాంకులకు ఉన్న అప్పులను కేంద్రం పరిగణనలోకి తీసుకుందని చెబుతున్నారు. ఈ మేరకు ఇటీవల ఎస్‌బీఐ అధికారులు స్టీల్‌ ప్లాంట్‌ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

స్టీల్‌ ప్లాంట్‌ సమస్యను శాశ్వత పరిష్కారానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని ఎస్‌బీఐ అధికారులు.. స్టీల్‌ ప్లాంట్‌ అధికారులకు వివరించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిర్వహణకు భూములను విక్రయించడంతోపాటు దానికి రుణాలను కూడా పెద్ద మొత్తంలో అందించనుందని తెలిపారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాలు సైతం సెయిల్‌ లో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్రం కూడా అదే ఆలోచన చేస్తుండటంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు మంచి రోజులు వచ్చినట్టేనని చెబుతున్నారు.

Tags:    

Similar News