సజ్జల కొత్త డౌట్..బాబు మెడికల్‌ రిపోర్ట్‌ ఇచ్చింది ఎవరు?

స్కిల్‌ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

Update: 2023-11-16 11:14 GMT

స్కిల్‌ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. అంతకముందు చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ లు తమ వాదనలు వినిపించారు! ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్య విషయాలు ఈ వాదనల్లో కీలకంగా మారే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ సమయంలో సజ్జల స్పందించారు!

అవును... చంద్రబాబు మెడికల్‌ రిపోర్టుపై జరుగుతున్న చర్చ, ఒక వర్గం మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండిపడ్డారు. అనారోగ్య కారణంతోనే చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్‌ వచ్చింది. ఈ క్రమంలో ఈ బెయిల్‌ పై మరికొంత కాలం బయట ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఫైరయ్యారు.

ఇదే సమయంలో చంద్రబాబుకు గుండె సంబంధ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని.. చంద్రబాబు గుండె సైజు పెరిగిందని.. దీంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని కథనాలు వస్తున్నాయి. ఈ సమయంలో... గుండె సంబంధిత ఇబ్బందులు ఉంటే వెంటనే స్టంట్ వేయటమో, బైపాస్ సర్జరీనో చేయాలి కానీ.. అంబులెన్స్‌ ని వెంట పట్టుకుని బయట తిరగమని డాక్టర్లు రిపోర్టు ఇచ్చారంటే ఇక వారిని ఏమనాలి? అని సజ్జల ప్రశ్నించారు.

వాస్తవానికి ఎవరికైనా రోగం ఉంటే వైద్యం చేయించుకోవటం సహజమే కానీ.. క్యాన్సర్‌ లాంటి రోగం ఉందో లేదో పరీక్షలు చేయాలని రిపోర్టు రాయటం ఏంటంటూ ఆగ్రహంతో కూడిన ఆశ్చర్యం వ్యక్తం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి... ఇలాంటి చిత్ర విచిత్రమైన రిపోర్టులు ఇప్పుడే చూస్తున్నామని.. సర్జరీలు చేయకపోతే మనిషి ఉంటాడో లేదో అన్నట్టుగా రిపోర్టులు తెచ్చుకోవటం చంద్రబాబుకే చెల్లిందని సజ్జల ఎద్దేవా చేశారు.

ఇక రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నంతసేపు ప్రాణాంతక వ్యాధులున్నట్టు ప్రచారం చేశారని.. కానీ, బెయిల్‌ రాగానే జైలు నుంచి ర్యాలీ పేరుతో హంగామా చేశారని గుర్తు చేసిన సజ్జల... మెడికల్‌ రిపోర్ట్‌ ఇచ్చింది వైద్యులా లేక రాజకీయ నేతలా? అని ప్రశ్నించారు. రాజమండ్రి జైలు నుంచి సుమారు 14గంటల పాటు ప్రయాణం చేసి విజయవాడకు వచ్చినప్పుడు అనారోగ్యంపై సహజంగానే కామెంట్ చేస్తారని తెలిపారు.

ఈ సందర్భంగా... చంద్రబాబు జైలులో ఉన్నా బయట ఉన్నా తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పిన సజ్జల... ఈ మొత్తం వ్యవహారంలో స్కాం జరిగిందన్న విషయం పక్కకి పోతోందని, ఈ స్కాం తాను చేయలేదని మాత్రం చంద్రబాబు ఇప్పటివరకూ చెప్పలేకపోతున్నారని, ఇదే సమయంలో ఆయన తరపు న్యాయవాదులు కూడా స్కాంపై వాదించడం లేదని అన్నారు.

Tags:    

Similar News