యార్లగడ్డపై సజ్జల కామెంట్లు
పోతే పోనీ అని యార్లగడ్డను ఎప్పుడూ అనలేదని సజ్జల క్లారిటీనిచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. తనతోపాటు పార్టీలో ఎవరూ అటువంటి కామెంట్లు చేయరని చెప్పారు.
గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు త్వరలో టీడీపీలో చేరబోతున్నానని పరోక్షంగా హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కొంతకాలంగా విభేదాలున్న నేపథ్యంలో ఆయన పార్టీ వీడి టీడీపీలో చేరబోతున్నానని పరోక్షంగా ప్రకటించారు. తనను పోతే పోనీ అని సజ్జల అన్నారని యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా యార్లగడ్డ కామెంట్లపై సజ్జల స్పందించారు.
పోతే పోనీ అని యార్లగడ్డను ఎప్పుడూ అనలేదని సజ్జల క్లారిటీనిచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. తనతోపాటు పార్టీలో ఎవరూ అటువంటి కామెంట్లు చేయరని చెప్పారు. పార్టీలో కూడా యార్లగడ్డను ఎవరూ అవమానించలేదని చెప్పుకొచ్చారు. యార్లగడ్డకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పామని, పార్టీ కోసం పని చేయాలని సూచించామని అన్నారు.
వైసీపీలో ఎక్కువమంది టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారని,, అందరికీ అవకాశం రాకపోవచ్చని చెప్పారు. అందకే టికెట్ రానివారిని తాము కన్విన్స్ చేస్తామని, లేదంటే వారే కన్విన్స్ కావాలని చెప్పారు. అలా కాదు అనే స్వేచ్ఛ వారికి ఉందని చెప్పారు. కానీ, ఏదైనా పార్టీ అంతర్గతంగా చర్చించాలని, ఇలా కార్యకర్తల సమావేశంలో బహిరంగ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఈ సమావేశాన్ని బట్టి యార్లగడ్డ ముందే టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని అన్నారు.
పవన్ వెనుక చంద్రబాబు ఉన్నాడని, ఆయన ఏం చెబితే జనసేనాని అది చేస్తారని దుయ్యబట్టారు. వారిద్దరూ విడిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా ఇద్దరూ ఒకటే అని, ప్రతిపక్ష ఓటు చీలకూడదని పవన్ చెబుతున్నారని గుర్తు చేశారు. పొత్తులపై తుది నిర్ణయం చంద్రబాబుదేనని సజ్జల చెప్పారు.