బిగ్ బాస్ ఫ్యాన్స్ పై సజ్జనార్ సీరియస్... ఎఫ్.ఐ.ఆర్. నమోదు!

పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ రచ్చలో ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్విన విషయాన్ని సజ్జనార్ సీరియస్ గా తీసుకున్నారు.

Update: 2023-12-18 09:08 GMT

బిగ్‍ బాస్ తెలుగు సీజన్‍ 7 విన్నర్ ఎవరో తేలిన సమయంలో హైదరాబాద్ లోని కృష్ణానగర్ ప్రాంతంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫైనల్ లో విన్నర్ పేరు వెల్లడైన అనంతరం... రైతు బిడ్డగా గుర్తింపు పొందిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ రచ్చలో ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్విన విషయాన్ని సజ్జనార్ సీరియస్ గా తీసుకున్నారు.

అవును... బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ ముగిసిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ పరిశరాల్లో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన అమర్‌ దీప్‌ కారును విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు చుట్టుముట్టారు. ఈ సమయంలో చేతికి అందిన వస్తువులను కారు మీదికి విసిరారు. దీంతో అద్దాలు పగిలిపోయాయి. ఈ సందర్భంగా కారు దిగి రావాలంటూ అమర్‌ దీప్‌ ను సవాల్ చేస్తూ.. కారు ముందుకు కదలకుండా అడ్డుపడ్డారు.

ఈ ఘటనతో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌ కు చేరుకున్నారు. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్, అమర్‌ దీప్ ల అభిమానుల అభిమానులమని చెప్పుకుంటూ అల్లరికి దిగినవారిని చెదరగొట్టారు. దీంతో అన్నపూర్ణ స్టూడియో నుంచి కృష్ణానగర్ - అన్నపూర్ణ స్టూడియోస్ బస్‌ స్టాప్ వద్దా ఘర్షణకు దిగారు.

ఈ సమయంలో వీరి రచ్చ కాస్తా ఆర్టీసీ బస్సులపై పడింది. ఈ సమయంలో వారంతా తమ ప్రతాపాన్ని అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులపై చూపించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సిటీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. ఇలా అభిమానులమని చెప్పుకుంటూ రచ్చ చేసిన వారు ఆర్టీసీ బస్సులపై తమ ప్రతాపాన్ని చూపించడంపై టీఎస్ ఆర్టీసీ అధికారులు సీరియస్ అయ్యారు.

ఇందులో భాగంగా... బస్సు అద్దాలను పగులగొట్టడంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసిన పోలీసులు అల్లరి మూకల కోసం గాలింపు చేపట్టారని తెలుస్తుంది. ఈ ఘటనపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మండిపడ్డారు. ఈ సందర్భంగా చేసిన ట్వీట్ కు హీరో నాగార్జున, స్టార్ మా లను ట్యాగ్ చేశారు.

ఇందులో భాగంగా... "ఇదేం అభిమానం! బిగ్ బాస్ -7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్‌ లోని కృష్ణానగర్‌ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి టీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. కూడా నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు" అని తెలిపారు.

ఇదే సమయంలో... "అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది" అని ట్వీట్ చేస్తూ హీరో నాగార్జునను ట్యాగ్ చేశారు.

Tags:    

Similar News