కృష్ణాలో 'ఇసుక కూటమి' రాజకీయం.. !
సౌమ్యుడిగా పేరొందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా కూడా పనిచేసిన నేత కుటుంబం మొత్తం ఇసుక వ్యవహారంలో చక్రం తిప్పుతుండడం గమనార్హం.;
ఉమ్మడి కృష్నాజిల్లాలో కూటమి నాయకుల మధ్య ఇసుక రాజకీయం జోరుగా సాగుతోంది. తీర ప్రాంత మండలాలైన.. చిలకలపూడి, నాగాయలంక, శ్రీకాకుళం, ఘంటసాల, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కొండము దురు వంటి కీలక ప్రాంతాల్లో ఇసుక ర్యాంపుల కోసం తమ్ముళ్లు-జనసైనికులు బాహాబాహీకి దిగుతున్నారు. మాదంటే మాదేనంటూ ఇసుకను సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఈ విషయంలో ఆధిపత్య రాజకీయాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
సౌమ్యుడిగా పేరొందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా కూడా పనిచేసిన నేత కుటుంబం మొత్తం ఇసుక వ్యవహారంలో చక్రం తిప్పుతుండడం గమనార్హం. కార్యకర్తలను సొంతగా నియమించి.. ఇసుక ర్యాంపుల నుంచి లారీలు కదలకుండా.. తమ వారిని మాత్రమే ఎంట్రీ ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రతిగా.. టీడీపీ నాయకులు కూడా అంతే తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం మనది అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంటుంటే.. ప్రభుత్వం మాదంటే మాదని.. ఈ రెండు పార్టీల నాయకులు రోడ్డున పడుతున్నారు.
ఈ ఘర్షణ ఎంత వరకు జరుగుతోందంటే.. ఏకంగా ఒకరి ఇసుక లారీలు.. మరొకరు సీజ్ చేసేంతగా పరిస్థితి మారిపోయింది. అంతేకాదు.. ఉద్రిక్తతల నేపథ్యంలో అవనిగడ్డలో పోలీసులు రాత్రికి రాత్రి పహారా ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. ఇక, మరికొన్ని చోట్ల మిలాఖత్ రాజకీయాలు సాగుతున్నాయి. ఇసుక లారీలకు ఇంతని రేటుకట్టి.. నాయకులు పంచుకుంటున్నారు. సాధారణంగా రీచ్‌లలో ప్రభుత్వానికి సొమ్ములు చెల్లించి ఇసుకను సేకరిస్తున్నారు.
కానీ, దీనిని నాలుగింతలు చేసి బయటకు విక్రయిస్తున్నారు. ఈ మొత్తం సొమ్ము కోసం.. నాయకులు పోటీ పడుతుండడంతో ఇటు ప్రజలు ధరలు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. ప్రభుత్వం లో భాగస్వాములుగా ఉన్న పార్టీలు రోడ్డున పడి కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నాగాయలంకలో జరిగిన ఘర్షణ కొట్లాటల వరకు దారితీసింది. దీంతో పార్టీలు రంగంలోకి దిగి.. సర్దిచెప్పే పరిస్థితి వచ్చింది. కానీ, ఈ పరిస్థితి కొనసాగితే.. మున్ముందు మరింత ప్రమాదమేనని పరిశీలకులు చెబుతున్నారు.