టీడీపీలో పొలిటికల్ 'శాండ్' ఏం జరుగుతోంది ?
దీనిని తనకు అనుకూలంగా మార్చుకున్న చంద్రబాబు.. శాండ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
కూటమి సర్కారులో పెద్దన్న పాత్ర పోషిస్తున్న టీడీపీ ఇప్పుడు శాండ్ రాజకీయాల్లో కూరుకుపోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనిపై నేరుగా చంద్రబాబు సైతం స్పందించే పరిస్థితి వచ్చిందంటేనే ఆశ్చర్యంగాను.. ఆసక్తిగాను మారింది. వైసీపీ హయాంలో ఇసుకను విక్రయించారు. ఎవరికీ ఉచితంగా ఇవ్వలేదు. దీనిని తనకు అనుకూలంగా మార్చుకున్న చంద్రబాబు.. శాండ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
తాము అధికారంలోకి వస్తే.. ఇసుకను ఉచితంగా ఇస్తామన్నారు. కేవలం రవాణా, కూలి ఖర్చులు మాత్రమే భరిస్తే చాలని పాత పాలసీనే కొత్తగా తీసుకువచ్చారు. దీంతో ప్రబుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు.. ఇప్పటి వరకు ఇసుక కారణంగా ఇబ్బందులు పడిన ప్రజలకు మేలు చేస్తున్నామని కూడా ఆయన భావించారు. కానీ, ఎక్కడో ఇది తేడా కొట్టింది. అనుకున్నం త మైలేజీ అయితే రావడం లేదు.
పైగా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ ఇసుక విషయంలో వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. చివరకు ఇవి చంద్రబాబు వరకు కూడా చేరాయి. దీంతో ఆయన తమ్ముళ్ల జోక్యానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని వారికి కూడా స్పష్టం చేశారు. ఎవరూ జోక్యం చేసుకోవద్దని ముఖ్యంగా ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు. అయితే.. పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయిపోయినా.. తమకు ఆదాయ వనరు కనిపించడం లేదని తమ్ముళ్లు వాపోతున్నారు.
సహజంగా ప్రభుత్వం తమ పార్టీ వారికి ఎంతో కొంత మేలు చేస్తుంది. ఈ క్రమంలోనే కాంట్రాక్టులు కొన్ని వారికి దక్కేలా చేస్తుంది. కానీ, ఇప్పటి వరకు చంద్రబాబు సర్కారు అలా చేయలేదు. దీంతో తమ్ముళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక విషయంలో జోక్యం చేసుకుంటూ.. బాగానే వెనుకేసుకుంటున్నారనేది చంద్రబాబు వరకు వచ్చిన వాస్తవం. దీంతో మరోసారి కూడా ఆయన హెచ్చరించి వదిలేశారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇబ్బందిగానే ఉంది. దీనిపై తాజాగా ప్రజాదర్బార్‌లోనూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో సీఎం సీరియస్ అయ్యారు. మరి మున్ముందు ఏం చేస్తారో చూడాలి.