టీడీపీలో ఆయ‌న శ‌కం ముగిసిన‌ట్టేనా... !

అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒకనాడు చక్రం తిప్పిన రాజకీయ కుటుంబం శత్రుచర్ల విజయరామరాజుది. ఆయనతోపాటు ఆయన తమ్ముడు చంద్రశేఖర్ రాజు కూడా రాజకీయంగా రాణించారు.

Update: 2024-12-16 15:30 GMT

శత్రుచర్ల విజయరామరాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిన నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన మంత్రిగా పనిచేశారు. అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒకనాడు చక్రం తిప్పిన రాజకీయ కుటుంబం శత్రుచర్ల విజయరామరాజుది. ఆయనతోపాటు ఆయన తమ్ముడు చంద్రశేఖర్ రాజు కూడా రాజకీయంగా రాణించారు. శ‌త్రుచ‌ర్ల‌ అన్నదమ్ములు ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావటం విశేషం. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో విజయరామరాజు హవా ఒక స్థాయిలో ఉండేది.

ఆ తర్వాత ఆయన టిడిపిలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. పాతపట్నం అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓట‌మి పాలయ్యారు. 2014లో రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యారు. అప్పుడు శ‌త్రుచ‌ర్ల ఓడిపోయినా కూడా బాబు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే పాతప‌ట్నంలో శ‌త్రుచ‌ర్ల‌పై గెలిచిన క‌ల‌మ‌ట వెంక‌ట ర‌మ‌ణ టీడీపీలోకి రావ‌డంతో అప్ప‌టి నుంచే శ‌త్రుచ‌ర్ల ప్రాభ‌వానికి గండిప‌డ‌డం మొద‌లైంది. 2019 ఎన్నికలలో తన మేనల్లుడికి కురుపాం టికెట్ ఇప్పించుకున్నా వైసీపీ ప్రభంజనంలో గెలిపించుకోలేకపోయారు.. అప్పటినుంచి రాజకీయంగా ఆయనకు కష్టాలు మొదలయ్యాయి.

చంద్రశేఖర్ రాజు కుమార్తె పల్లవిని కురుపాం నుంచి టిడిపి అభ్యర్థిగా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా చంద్రబాబు అసలు పట్టించుకోలేదు. మరోవైపు ఆయన తమ్ముడు చంద్రశేఖర్ రాజు కోడలు పుష్ప శ్రీవాణి వైసిపి నుంచి రెండుసార్లు కురుపాం ఎమ్మెల్యేగా విజయం సాధించడంతోపాటు జగన్ క్యాబినెట్లో ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అలా కుటుంబంలో కూడా చీలికలు వచ్చాయి. ఇక కేంద్ర మాజీమంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ తమ్ముడి కుమారుడు అయిన వీరేష్ చంద్రదేవ్‌కి టిడిపిలో ఇప్పుడు ప్రముఖ స్థానం దక్కుతుంది.

ఆయన సిఫార్సుల మేరకు తోయ‌క జగదీశ్వ‌రికి కురుపాం ఎమ్మెల్యే టికెట్ దక్కింది. ఏమాత్రం అంచనాలు లేని చోట కురుపాంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది.. జగదీశ్వరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు వీరేష్ చంద్రదేవకు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పదవి కూడా ఇచ్చారు. దీంతో విజయనగరం జిల్లా ఏజెన్సీలో వీరేష్ హ‌వా కొనసాగుతోంది. ఈ క్రమంలో శత్రుచర్ల టిడిపిలో కూడా రాజకీయంగా వెనకబడిపోయారు. ఒకవైపు వయసు పై పడటంతో పాటు ఇప్పుడు టిడిపిలో ఆయన మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే రాజకీయంగా ఆయన శకం ఇక ముగిసినట్టే అన్న చర్చలు ఉత్తరాంధ్ర‌లో వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News