లోకేశ్‌ పర్యటన వేళ.. కీలక నియోజకవర్గంలో మళ్లీ కలకలం!

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి

Update: 2023-08-02 07:22 GMT

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా నుంచి పల్నాడు జిల్లాలోకి ప్రవేశించింది. ఇంతటి కీలక సమయంలో పల్నాడు నియోజకవర్గంలో కీలక నియోజకవర్గమైన సత్తెనపల్లిలో టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గ ఇంచార్జి పదవిని ఆశించి ఆ పదవి దక్కకపోవడంతో అప్పటి నుంచి టీడీపీ అధిష్టానంపై గుస్సా అవుతున్నారు.. మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్‌.

2014లో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లిలో గెలుపొందారు. దాదాపు 1000 ఓట్ల మెజారిటీతో వైసీపీ నేత అంబటి రాంబాబుపై కోడెల విజయం సాధించారు. 2014లో తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన అంబటి రాంబాబు 2019లో గెలుపొంది సత్తా చాటారు. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు.

2019లో కోడెల శివప్రసాదరావు మరణానంతరం సత్తెనపల్లి సీటును పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు వైవీ ఆంజనేయులు, తెలుగు యువత నేత అబ్బూరి మల్లి, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కుమారుడు కోడెల శివరామ్‌ ఆశించారు. అయితే బీజేపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఆ సీటును కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆయనను సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జిగా నియమించారు. చంద్రబాబు నిర్ణయంపై కోడెల శివరామ్‌ బహిరంగంగానే అసంతృప్తి గళం వినిపించారు. టీడీపీకి ఎంతో సేవ చేసిన తమ కుటుంబాన్ని టీడీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదని విమర్శలు సంధించారు.

ఇప్పుడు తాజాగా నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లాలోకి ప్రవేశించిన నేపథ్యంలో మరోమారు కోడెల శివరామ్‌ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సత్తెనపల్లి ఇంచార్జిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు కోడెల శివరామ్‌ వర్గం సహకరించడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో వారికి టీడీపీ అధిష్టానం నోటీసులు పంపింది.

ఈ నోటీసులపై కోడెల శివరామ్‌ మండిపడ్డారు. దశాబ్దాలుగా పార్టీ జెండాని మోసి.. పార్టీ కోసం కష్టపడిన తమకు నోటీసులు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు సత్తెనపల్లి టీడీపీ ఆఫీసులో అడుగుపెట్టని కన్నా లక్ష్మీనారాయణకు నోటీసులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తన తండ్రి కోడెల శివప్రసాదరావు పేరు వినపడకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

కోడెల శివరామ్‌ వ్యాఖ్యలు పల్నాడు జిల్లా టీడీపీలో కలకలానికి దారితీశాయి. అందులోనూ లోకేశ్‌ యువగళం పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించిన రోజే శివరామ్‌ వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీకి ఇబ్బందేనని అంటున్నారు.

Tags:    

Similar News