'ఏఐ' మాటే సత్య నాదెళ్లకు నచ్చదట.. నిజమే కదా?
టెక్నాలజీ గురించి మాట్లాడే వారంతా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి మాట్లాడకుండా తమ సంభాషణను పూర్తి చేయరు
టెక్నాలజీ గురించి మాట్లాడే వారంతా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి మాట్లాడకుండా తమ సంభాషణను పూర్తి చేయరు. ఇటీవల కాలంలో దీని ప్రస్తావన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీని గురించి ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఆందోళన వ్యక్తం చేయటం ఒక ఎత్తు అయితే.. దీని కారణంగా రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు ఇబ్బందికరంగా ఉంటాయన్న అంచనా వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వాదన మాత్రం భిన్నంగా ఉంటుంది. ఆయనకు ఏఐ అన్న మాటే నచ్చదని చెబుతున్నారు.
ఏఐపై ఆయన వాదన వింటే కొత్తగా ఉండటమే కాదు.. ఆయన మాటల్లో నిజం ఉంది కదా? అన్న భావన కలుగక మానదు. ఏఐ అనేది ఒక టూల్ మాత్రమేనని.. దాన్ని మనుషులతో పోల్చటం సరికాదంటున్నారు. ఏఐ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘అత్యంత దురదృష్టకరమైన పేర్లలో ఒకటి కృత్రిమ మేధస్సు అని నేను అనుకుంటా. మనం దానిని డిఫరెంట్ ఇంటెలిజెన్స్ అని పిలవొచ్చు. ఎందుకుంటే నాకు ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి నాకు ఏఐతో అవసరం లేదు. 1950లో పుట్టుకొచ్చిన ఈ పదం నాకు నచ్చడు’’ అని పేర్కొన్నారు.
సాంకేతికత ఎంత పెరిగినా అది మానవ మేధస్సుకు సరికాదన్న ఆయన మనిషికి అపారమైన తెలివితేటలు ఉన్నాయని చెప్పిన ఆయన.. మనిషి క్రియేట్ చేసిన దాన్ని మనిషి కంటే గొప్పదని అనుకోవటం ఏమిటి? అన్నది ఆయన ప్రశ్న. ఏఐ కేవలం ఒక టూల్ మాత్రమేనని చెప్పిన సత్యనాదెళ్ల.. ‘‘ఇలాంటి సాంకేతికతలు భవిష్యత్తులో లెక్కకు మించి రావొచ్చు. ఆ ఘనత మొత్తం మనిషికే దక్కొచ్చు. దీనికి కారణం లేకపోలేదు. దీన్ని క్రియేట్ చేసింది మనిషేనన్నది మర్చిపోకూడదు. ఏఐ మానవ భాషలో మనిషి కోరుకున్న విషయాల్ని వెల్లడిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఏఐపై ఇప్పటివరకు పలువురు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలకు కాస్తంత భిన్నంగా సత్య నాదెళ్ల వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.