'యూట్యూబర్'.. ఇదో జాబ్.. ఎన్నికల్లో ఓడిన మాజీ మంత్రికీ..
ఢిల్లీలో గత వారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పరాజయం పాలైంది. పదేళ్లు అధికారం అనంతరం ఆ పార్టీ ఓటమిని ఎదుర్కొంది.
కాలంతో పాటు ఉద్యోగాలు మారడం అంటే ఏమిటో అనుకున్నాం.. ఇప్పుడు పరిస్థితులను చూస్తేం నేరుగా తెలుసుకుంటున్నాం.. ‘యూ ట్యూబర్’.. ఓ ప్రొఫెషన్ అవుతుందని ఎపుడైనా ఊహించామా..? చేతిలో సెల్ ఫోన్.. దానికి ట్రై ప్యాడ్.. గో ప్రో తగిలించేసి.. టూర్లు చేస్తూనో, అన్ బాక్స్ లు చేస్తూనో.. ఫన్నీ వీడియోలు చేస్తూనో.. తాము ఉంటున్న దేశాలను చూపుతూనో.. యూట్యూబ్ ను ఓ సంపాదన మార్గంగా మలుచుకున్నారు కొందరు. అయితే, ఇప్పటివరకు యువత, టెకీలు, ఫ్యామిలీలకు మాత్రమే సంబంధించినది అనుకుంటే.. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకూ యూట్యూబ్ ఓ సాధనంగా మారింది. దానిద్వారా సంపాదన అనేది ఎంతనేది తర్వాతి సంగతి...
ఢిల్లీలో గత వారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పరాజయం పాలైంది. పదేళ్లు అధికారం అనంతరం ఆ పార్టీ ఓటమిని ఎదుర్కొంది. ఈ క్రమంలోనే పరాజయం పాలయ్యారు ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్, కీలక నాయకుడు మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ తదితరులు. వీరేకాక మూడుసార్లు గెలిచన నాయకుడు సౌరభ్ భరద్వాజ్ కూ ఓటమి తప్పలేదు. అయితే, ఈ ఓటమిని తలచుకుంటూ ఆయనేమీ కుంగిపోలేదు. ఏకంగా యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించారు.
గ్రేటర్ కైలాశ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు నెగ్గారు భరద్వాజ్. అయితే, ఈసారి మాత్రం పరాజయం పలకరించింది. ఈయన ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఎలాగూ ఓడిపోవడంతో ‘నిరుద్యోగ నేత’ అంటూ యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించారు. 58 సెకన్లో వీడియోను తన చానెల్ లో అప్ లోడ్ చేశారు. ‘ఫలితాల అనంతరం నా జీవితం తారుమారైంది. నిరుద్యోగ నేతగా మిగిలిపోయాను. ఈ ఫలితాలు నాతో పాటు ఎందరో నేతలను నిరుద్యోగులుగా మార్చాయి. యూ ట్యూబ్ చానల్ ద్వారా ఓటమి తర్వాత రాజకీయ నాయకుడి జీవితంలోని పరిస్థితులను మీతో పంచుకుంటాను. ప్రజలు వారి సందేశాలను నాతో పంచుకోవచ్చు. మీ ప్రశ్నలకు బదులిచ్చేందుకు ప్రయత్నిస్తా’ అని భరద్వాజ్ సూచించారు.
ఆప్ సర్కారులో భరద్వాజ్.. గృహ, ఆరోగ్యం, నీరు, పరిశ్రమలు వంటి వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. ఇటీవలి ఎన్నికల్లో 3 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడారు.