షాయాజి షిండే పొలిటికల్ ఎంట్రీ.. ఏ పార్టీలో చేరారంటే!
తన వినూత్న శైలి నటన, విభిన్న శైలి వాక్పటిమతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన మరాఠా నటుడు షాయాజి షిండే రాజకీయాల్లోకి అడుగులు వేశారు.
తన వినూత్న శైలి నటన, విభిన్న శైలి వాక్పటిమతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన మరాఠా నటుడు షాయాజి షిండే రాజకీయాల్లోకి అడుగులు వేశారు. `అతడు` సహా పలు సినిమాల్లో విలన్‌గా నటించిన ఆయన ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌ను కూడా కలుసుకు న్నారు. తిరుమల లడ్డూ వివాదం తెరమీదికి వచ్చినప్పుడు.. తనదైన శైలిలో స్పందించారు. గుడికి వచ్చిన వారికి ప్రసాదంతోపాటు మొక్కలు కూడా ఇవ్వాలని, తాను మహారాష్ట్రలో అదే చేస్తున్నానని కూడా చెప్పుకొచ్చారు. పవన్ చేసిన ప్రాయశ్చిత్త దీక్షకు ఆయన మద్దతు కూడా తెలిపారు.
ఇక, ఇప్పుడు షాయాజి షిండే.. రాజకీయాల్లో వచ్చారు. మహారాష్ట్రలో ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదట్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 288 స్థానాలు ఉన్న ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం.. అన్ని పార్టీలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మంచి పేరు, ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న షాయాజి షిండే.. రాజకీయంగా అడుగులు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. ఇది మాజీ సీఎం శరద్ పవార్ సొంత పార్టీ. అయితే.. ఆయన తమ్ముడి కొడుకు అజిత్.. గత ఏడాది పార్టీని చీల్చి.. ఎన్సీపీ తనదేనని ప్రకటించుకున్నారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలానే ఆశలు పెట్టుకుంది. ఇలాంటి సమయంలో హిందూత్వ భావాలు మెండుగా ఉన్న షిండే తొలుత బీజేపీ వైపే మొగ్గు చూపారు. అయితే, నేరుగా బీజేపీలోకి కాకుండా.. పరోక్షంగా అజిత్ వైపు కమల నాథులు నడిపిం చారు. తాజాగా తీర్థం పుచ్చుకున్న షిండే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. కాగా.. అజిత్ పవార్‌తో షిండేకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీలో చేరానని అజిత్ చెప్పుకొచ్చారు.
పార్టీలో షిండేకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. అంతేకాదు, ఎన్సీపీ `స్టార్ క్యాంపెయినర్`గా షిండేను నియమించనున్నట్టు వివరించారు. దీంతో ఎన్సీపీ, బీజేపీ, శివసేన(ఏక్‌నాథ్ షిండే - సీఎం)కు బలమైన సినీ గళం లభించినట్టు అయిందని పరిశీలకులు చెబుతున్నారు.