శ్రీనగర్ కు రైల్లో చేరే రోజు దగ్గరకు వచ్చేసిందోచ్
అలా ట్రైన్ లో కూర్చొని పర్వత నగరం శ్రీనగర్ కు చేరుకుంటే ఎంత బాగుంటుంది? ఇప్పటివరకు ఇదో అందమైన ఊహ.;

అలా ట్రైన్ లో కూర్చొని పర్వత నగరం శ్రీనగర్ కు చేరుకుంటే ఎంత బాగుంటుంది? ఇప్పటివరకు ఇదో అందమైన ఊహ. మరో మూడు వారాల్లోపు ఆ కల కాస్తా నిజం కానుంది. కశ్మీర్ లోయకు ట్రైన్ లో ప్రయాణించే రోజు కోసం ఎదురుచూసిన నిరీక్షణకు తెర పడనుంది. ఏప్రిల్ 19న కట్రా నుంచి శ్రీనగర్ కు వెళ్లే రైలు సేవల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. నూతన రైలు సర్వీస్ ప్రారంభోత్సవాన్ని చిరస్మరణీయంగా మార్చేందుకు కొత్త మార్గంలో వందే భారత్ ట్రైన్ ను నడపాలని అధికారులు డిసైడ్ చేశారు.
ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైలు వంతెన ఈ మార్గంలోనే ఉంది. చినాబ్ నది మీద నిర్మించిన ఈ ట్రాక్ ను అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో నిర్మించారు. కొద్ది రోజుల పాటు కట్రా.. శ్రీనగర్ స్టేషన్ల మధ్యన రైలుసర్వీసును నడుపుతారు. ఆ తర్వాత జమ్మూ రైల్వే స్టేషన్ విస్తరణ పూర్తి అయ్యాక మాత్రం కట్రా నుంచి జమ్మూ వరకు సేవల్ని పొడిగిస్తారు. ఈ పనులు ఆగస్టు నాటికి పూర్తి అవుతాయని భావిస్తున్నారు.
అంటే.. ఆగస్టు నుంచి జమ్మూ నుంచి నేరుగా శ్రీనగర్ కు వెళ్లేందుకు వీలుగా రైళ్ల సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు మాత్రం జమ్మూ పట్టణం నుంచి కట్రా వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించి..అక్కడి నుంచి శ్రీనగర్ కు రైలులో చేరుకునే వీలుంది. ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు నేరుగా ఒక్క రైలు సర్వీసు లేదు. అందుకు భిన్నంగా కట్రా - శ్రీనగర్ /బారాముల్లా స్టేషన్లు అందుబాటులోకి రావటం ద్వారా రానున్న రోజుల్లో ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు నేరుగా ట్రైన్ లో ప్రయాణించే వీలు ఉంటుంది. అదే జరిగితే.. శ్రీనగర్ కు ప్రయాణం మరింత తేలిగ్గా.. చౌకగా చేరుకునే వీలు కలుగుతుంది.