రోజుకో సూర్యుడు హాంఫట్.. విశ్వంలో మరో గుట్టు రట్టు

ఈ క్వాసార్ ను 1980 నుంచి స్కై సర్వేలో యూరోపియన్ సదరన్ అబ్జర్వే టరీ గుర్తించారు.

Update: 2024-02-20 04:22 GMT

అనంత విశ్వం గురించి మనిషికి తెలిసింది చిటికెడు మాత్రమే. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా.. ఎన్నో అద్భుతాలు.. మరెన్నో విశేషాల్ని గుర్తించే విషయం ఎంత వెనుకబడి ఉన్నామన్న విషయం కొన్ని సమయాల్లో అర్థమవుతూ ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంతాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్ ను సైంటిస్టులు గుర్తించారు. దాని మధ్యలో అత్యంత పెద్దదైన ఒక క్రిష్ణబిలం ఉన్నట్లుగా గుర్తించారు. ఇది చాలా వేగంగా ఎదుగుతోందని.. అది రోజూ సూర్యుడు పరిణామంలో ఉన్న పదార్థాన్ని స్వాహా చేస్తున్నట్లుగా గుర్తించారు.

మన సూర్యుడి కన్నా 500 లక్షల కోట్ల రెట్లు ఎక్కువగా వెలుగులీనుతుందంటే.. దాని సైజు ఎంతన్నది అంచనా వేయటానికి కాసింత సమయం పట్టటం ఖాయం. దీనికి ఆయువుగా ఉన్న క్రిష్ణ బిలం.. సూర్యుడి కన్నా 17 వందల కోట్ల రెట్లు పెద్దగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రిష్ణ బిలం చుట్టూ చేరుతున్న వాయువులు సుడులు తిరుగుతూ అంతరిక్షతుపాను తలపించేలా ఉందని చెబుతున్నారు.

ఈ క్వాసార్ ను 1980 నుంచి స్కై సర్వేలో యూరోపియన్ సదరన్ అబ్జర్వే టరీ గుర్తించారు. గతంలో దాన్ని ఒక నక్షత్రంగా భావించారు. అయితే.. అది అత్యంత శక్తివంతమైన క్వాసార్ గా గుర్తించారు. ఆస్ట్రేలియా.. చిలీలోని టెలిస్కోపులతో పరిశీలించినప్పుడు దీన్ని గుర్తించారు. ఇది మనకు 12 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. విశ్వం ఏర్పడిన తొలినాళ్లలో ఇది పుట్టి ఉంటుందని భావిస్తున్నారు. ఈ అద్భుతం గురించి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.

Tags:    

Similar News