వణుకు పుట్టే మాట చెప్పిన సెబీ ఛైర్ పర్సన్!
సెబీ ఛైర్ పర్సన్ నోటి నుంచి వచ్చిన తాజా మాటలకో బీఎస్ఈలోని ఎస్ఎంఈ ఐపీవో సూచీ 3.28 శాతం నష్టపోయింది.
కొన్ని దశాబ్దాల క్రితం ఒక నానుడి తరచూ రాజకీయ వర్గాల్లో వినిపించేది. కమ్యునిస్టులను ఉద్దేశించిన ఈ నానుడి ఏమిటన్నది చూస్తే.. చైనాకు జలుబు చేస్తే భారత్ లోని కమ్యూనిస్టుకు పడిశం పడుతుందని చమత్కరించే వారు. షేరు మార్కెట్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే తరహాలో ఉంటుందని చెప్పాలి. ఎక్కడో జరిగే పరిణామానికి కూడా మార్కెట్లు కుదుపునకు గురవుతుంటాయి. అంత సున్నితంగా ఉండే సూచీలకు తాజాగా షాకిచ్చే మాట ఒకటి సెబీ ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న మాధవి పురి బుచ్ నుంచి వచ్చింది.
ఆ వెంటనే దేశీయ సూచీలు ప్రతికూలంగా స్పందించాయి. ఇంతకు ఆమె నోటి నుంచి వచ్చిన మాటేమిటి? దాని ఫలితంగా ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? అన్నది చూస్తే.. సోమవారం ఒక సదస్సుకు హాజరైన ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చిన్న.. మధ్యతరమా సంస్థల షేర్ల ధరల్లో అవకతవకలు జరుగుతున్న అంశం తమ వరకు వచ్చిందన్న నఆమె.. ఈ విషయంలో ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఈ సున్నితమైన మందలింపు పుణ్యమా అని మార్కెట్లు స్పందించాయి. కాస్తంత కుదుపునకు గురయ్యాయి. ఆమె చేసిన వ్యాఖ్యల్లో మరో ముఖ్యమైన అంశం ఉంది. ఐపీవోలతో పాటు సెకండరీ మార్కెట్.. ట్రేడింగ్ లో అవకతవకలు జరుగుతున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందన్నారు.
ఈ నేపథ్యంలో మదుపరులు అధిక రిస్కుతో ఉన్న కంపెనీ షేర్లలో పెట్టబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొన్ని సంస్థలు చేస్తున్న తప్పుడు వ్యవహారాలు తమ వరకు వచ్చాయని.. డేటాను విశ్లేషిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆమె చెప్పినట్లే.. కొన్ని సంస్థలు తప్పుడు మార్గాల్ని అనుసరిస్తుంటే.. చర్యల కొరడా దెబ్బలు తప్పవు. అప్పుడు మార్కెట్ కు పరీక్షా కాలమే అవుతుందని చెప్పాలి.
సెబీ ఛైర్ పర్సన్ నోటి నుంచి వచ్చిన తాజా మాటలకో బీఎస్ఈలోని ఎస్ఎంఈ ఐపీవో సూచీ 3.28 శాతం నష్టపోయింది. మార్కెట్ లో కొన్ని విభాగ షేర్ల ధరలు అసాధారణంగా పెరుగుతున్నట్లుగా మాధవి ఆందోళన వ్యక్తం చేశారు. 2023 జనవరి నుంచి చిన్న.. మధ్యతరహా సూచీలు సెన్సెక్స్.. నిఫ్టీకి మించిన పని తీరును కనపర్చటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా మార్కెట్లకు సంబంధించి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన విషయాన్ని సెబీ ఛైర్ పర్సన్ చెప్పేశారని చెప్పాలి. ఈ నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది.