రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ వచ్చేస్తోంది !
మొదటి సిలిండర్ ని దాదాపుగా కోటి మంది దాకా అందుకుంటే ఈసారి అంతకు మించి జనాల నుంచి స్పందన ఉంటుందని భావిస్తున్నారు.;

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పేదలకు ఇస్తామని ఎన్నికల్లో ఒక కీలక హామీ గా ప్రకటించింది. ఆ హామీని గత ఏడాది దీపావళి పండుగ వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఇక గత ఏడాది అక్టోబర్ 29 నుంచి మార్చి 31 మధ్యలో ఒక సిలిండర్ ని ఉచితంగా ప్రభుత్వం ఇచ్చింది.
ఈ మధ్యలో ఎన్ని సిలిండర్లు బుక్ చేసుకున్నా అందులో ఒకటి మాత్రం ఫ్రీ. దానికి డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ విధంగా ఏపీలోని మొత్తం 99 లక్షల మంది లబ్ధిదారులు దీపం 2 పధకం కింద లబ్ది పొందారు. ఇక గత ఏడాది కేవలం ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం 2,684 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.
దీపం పధకం 2 కింద అర్హులైన లబ్దిదారులుగా మొత్తం 1.55 కోట్ల మందిని ప్రభుత్వం గుర్తించింది. వారిలో 99 లక్షల మంది ఈ ఫలితాన్ని అందుకున్నారు. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింప చేసింది అన్న మాట. మొదటి సిలిండర్ ని దాదాపుగా కోటి మంది దాకా అందుకుంటే ఈసారి అంతకు మించి జనాల నుంచి స్పందన ఉంటుందని భావిస్తున్నారు.
ఏప్రిల్ 1 నుంచి జూలై 1వ తేదీ మధ్యలో ఈ రెండవ సిలిండర్ ని బుక్ చేసుకోవాలి. ఈ మధ్యలో బుక్ చేసుకున్న ఒక సిలిండర్ కి ప్రభుత్వమే డబ్బులు చెల్లించి లబ్దిదారులకు ఉచితంగా అందచేస్తుంది. ఈ పధకాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు.
ఇక మూడవ విడత ఉచిత గ్యాస్ సిలిండర్ ని కూడా ఇదే ఏడాది ఆగస్ట్ 1వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ మధ్యలో బుక్ చేసుకోవచ్చు అని షెడ్యూల్ ప్రకటించారు. ఇందుకోసం 2025-26 వార్షిక బడ్జెట్ లో కూడా నిధులను ప్రభుత్వం కేటాయించింది. దాంతో ఫ్రీ గ్యాస్ పధకానికి నిధుల కొరత అయితే లేదు.
కానీ దీని మీదనే విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. 2024-25లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లను గత ఆర్ధిక సంవత్సరంలో ఇవ్వకుండా కేవలం ఒకటి మాత్రమే ఇచ్చిందని విమర్శిస్తున్నాయి.
ఇక ఈ 2025-26కి సంబంధించి కొత్త ఆర్థిక సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా రెండుకే పరిమితం చేస్తారా అన్న విమర్శలు సంధిస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది ఇచ్చిన ఒక సిలిండర్ ని ఈ ఏడాదిలో కలిపేస్తూ రెండవ సిలిండర్ గా ఏప్రిల్ నుంచి ఇస్తున్నామని ప్రకటించారని అంటున్నారు. ఇక నవంబర్ 1తో మూడవ సిలిండర్ ఇవ్వడం పూర్తి అవుతుందని ఆ మీదట మళ్ళీ కొత్త సిలిండర్ ని 2026 మార్చి 31లోగా ఉచితంగా ఇస్తారా లేక ఈ ఆర్ధిక సంవత్సరం ఇంతేనా అని అడుగుతున్నారు. దీని మీద స్పష్టత ఇవ్వాలని అంటున్నారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది దీపావళికి ఈ పధకాన్ని మొదలెట్టింది కాబట్టి దీపావళి టూ దీపావళికి మూడు ఉచిత సిలిండర్లను ఇస్తోందని అందువల్ల దీపావళి నుంచి మరో మూడింటికి ఉచితంగా ఇచ్చే ప్రక్రియ మొదలు అవుతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో అధికారికంగా ఏ విషయం ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. అయితే వైసీపీ సహా విపక్షాలు మాత్రం ఏప్రిల్ టూ మార్చి 31 దాకా ఉన్న ఆర్ధిక సంవత్సరానికి ప్రామాణికంగా తీసుకుని ఏడాదికి మూడు ఉచితాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.