రేవంత్, కేటీఆర్, బండి ఈ ముగ్గురూ స్నేహితులా?

తెలంగాణ రాజకీయం గరం.. గరంగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి కేవలం 15 నెలలే అవుతున్నా, నేడో రేపో ఎన్నికలు అన్నట్లు రాజకీయం నడుస్తోంది.;

Update: 2025-04-09 06:18 GMT
Secret Friendships and Political Drama

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ ముగ్గురు భిన్న ధ్రువాలు. మూడు పార్టీలకు నాయకత్వం వహిస్తున్న నేతలు. రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కానీ, ఈ ముగ్గురూ రహస్య స్నేహితులంటూ ఆరోపణలు వస్తున్నాయి. అలా ఆరోపిస్తున్నది కూడా వేరెవరో కాదు. ముగ్గురు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంలో భాగంగా ఒకరితో ఒకరికి రహస్య స్నేహం ఉందంటూ ఆరోపించుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఈ ఆరోపణలకు ఇటీవల జరిగిన పరిణామాలను ఉదహరిస్తుండటం విశేషంగా చెబుతున్నారు.

తెలంగాణ రాజకీయం గరం.. గరంగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి కేవలం 15 నెలలే అవుతున్నా, నేడో రేపో ఎన్నికలు అన్నట్లు రాజకీయం నడుస్తోంది. ప్రధానంగా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని అనుకుంటున్న బీజేపీ పోటాపోటీగా తలపడుతున్నాయి. అధికార కాంగ్రెస్ తో విపక్షాలు ఢీ అంటే ఢీ అన్నట్లు వార్ కొనసాగిస్తున్న నేతలు ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి వేస్తున్న ఎత్తులు చర్చనీయాంశమవుతున్నాయి. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు తెలంగాణలో తలపడుతున్న మూడు పక్షాలు ఒకరితో ఒకరు మిత్రులు అని చెప్పుకుంటూ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు స్నేహంగా ఉంటున్నారని బీఆర్ఎస్.. బీజేపీ, బీఆర్ఎస్ మిత్రులు అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే దోస్తీ నడుస్తుందంటూ బీజేపీ విమర్శలు చేసుకోవడం ఆసక్తి రేపుతోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.50 వేల కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్నేహంగా ఉండటం వల్ల ఆయన స్కాంలపై విచారణ జరిపించడం లేదని కేటీఆర్ అంటున్నారు. ప్రధాని మోదీని పెద్దన్నగా చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి సంజయ్ తో రాసుకుపూసుకు తిరుగుతున్నారని విమర్శలు చేస్తున్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ ఆరోపణలపై ఇటు సీఎం రేవంత్, అటు కేంద్ర మంత్రి సంజయ్ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కే స్నేహం ఉందని బీజేపీ నేత ఆరపిస్తుండగా, బీజేపీతో బీఆర్ఎస్ కే అవగాహన ఉందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తుతున్నారు. దీంతో మూడు పార్టీల్లో ఎవరితో ఎవరికి స్నేహం ఉందో తెలియడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ లబ్ది పొందింది. బీఆర్ఎస్ కి ఓటు వేసినా బీజేపీకి ఓటేసినా ఒకటేనంటూ అప్పట్లో కాంగ్రెస్ చేసిన ప్రచారం సత్ఫలతమిచ్చింది. దీంతో ఎన్నికల అనంతరం ఆ రెండు పార్టీలు స్ట్రాటజీ మార్చాయి. ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తామే చాంపియన్ గా నిలవాలని భావిస్తున్న కమలం, గులాబీ పార్టీలు.. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డితో స్నేహం చేస్తున్నారంటూ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సీఎం రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లడంతో ఆ ఇద్దరి మధ్య స్నేహం బయటపడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపిస్తుండగా, బీఆర్ఎస్ హయాంలో జరిగిన కుంభకోణాలు, ఫోన్ ట్యాపింగు కేసుల్లో చర్యలు తీసుకునేందుకు కేంద్రం సహకరించకుండా తమ స్నేహితుడు కేసీఆర్ ను కాపాడుతున్నారని బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యారోపణలు చేస్తున్నారు. దీంతో మూడు పార్టీలు ఫ్రెండషిప్ వార్ చేస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News