సికింద్రాబాద్ స్టేషన్ చిల్లర దొంగ దెబ్బకు పోలీసులకు చుక్కలు!

ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి బ్యాక్ పాక్ తీసుకెళున్న విషయాన్ని గుర్తించారు. గాంధీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు

Update: 2023-10-27 05:19 GMT

ఒక చిల్లర దొంగ చేసిన పని రైల్వే పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులకు చుక్కలు కనిపించాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారటమే కాదు.. వందలాది మంది పోలీసులు కొన్ని గంటల పాటు తీవ్రమైన టెన్షన్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు కథ సుఖాంతమైనా.. ఈ ఉదంతం పోలీసు వర్గాల్లో మాత్రం టెన్షన్ ను తెచ్చి పెట్టింది. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో సీఆర్ఫీఎఫ్ 95వ బెటాలియన్ కు చెందిన నలుగురు కానిస్టేబుళ్లు యూపీలోని బెనారస్ కు విధి నిర్వహణలో భాగంగా వెళ్లాల్సి వచ్చింది. ఇందులో భాగంగా ఈ నెల 24 ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లారు.

దానాపూర్ ఎక్స్ ప్రెస్ రైల్లో వీళ్లు ప్రయాణించాల్సి ఉంది. ఇందులో బాగంగా పదో నెంబరు రైల్లో వీరు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సిద్ధార్ధ్ సింగ్ కు చెందిన బ్యాక్ పాక్ మిస్ అయ్యింది. ఇందులో 60 రౌండ్ల బుల్లెట్లతో పాటు మూడు మేగజైన్లు ఉండటంతో పోలీసులు.. రైల్వే పోలీసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. రైల్వేస్టేషన్ తో పాటు.. పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది సీసీ కెమేరాల ఫుటేజ్ ను జల్లెడ పట్టారు.

ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి బ్యాక్ పాక్ తీసుకెళున్న విషయాన్ని గుర్తించారు. గాంధీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 21 ఏళ్ల ఆనందమూర్తిగా గుర్తించాడు. అతడో చిల్లరదొంగ అని.. అతన్ని అదుపులోకి తీసుకున్న సమయంలో అతని వద్ద ఆయుధాలు లేకపోవటంతో అతన్ని ప్రశ్నించారు.

సంచిలో ఉన్న ఫుడ్ పాకెట్స్ ను అమ్మేశానని.. అందులో ఆయుధాలు ఉండటంతో భయంతో గాంధీనగర్ మెట్రో పిల్లర్ వద్ద పడేసినట్లుగా చెప్పాడు. దీంతో.. అక్కడి సమీపంలోని సీసీ కెమేరాల్సి పరిశీలించగా.. ఒక పెద్ద వయస్కుడు ఆ సంచిని తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. మళ్లీ ఆ పెద్ద వయస్కుడి కోసం గాలింపు చేపట్టారు. చివరకు ముషీరాబాద్ భోలక్ పూర్ లోని సత్యనారాయణ వద్ద బ్యాక్ పాక్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత కానీ పోలీసులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి. బ్యాక్ పాక్ తీసుకోవటంతో సత్యనారాయణకు ఎలాంటి దురుద్దేశాలు లేవన్న విషయాన్ని విచారణలో గుర్తించటంతో అతన్ని వదిలేశారు. బ్యాగ్ పోయిన 24 గంటల్లో కేసును చేధించిన పోలీసు టీంను డీజీపీ అభినందించారు.

Tags:    

Similar News