మాజీ మంత్రి కనిపించడం లేదే.. ఏమైంది ..!
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తరచుగా మీడియా ముందుకు వచ్చే వారు. వైసీపీ పాలనపై పాజిటివ్‌గా స్పందించేవారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తరచుగా మీడియా ముందుకు వచ్చే వారు. వైసీపీ పాలనపై పాజిటివ్‌గా స్పందించేవారు. అదేసమయంలో టీడీపీపై నిప్పులు చెరిగేవారు. ఇక, ఇప్పుడు కొన్నాళ్లుగా ఆయన కనిపించడం లేదు. పలాస నియోజకవర్గంలోనూ ఆయన పేరు వినిపించడం లేదు. ఆయన కూడా కనిపించడం లేదు. ఎక్కడున్నారో కూడా చెప్పకుండా.. కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారు.
నిజానికి ఎన్నికలకు ముందు, తర్వాత కూడా సీదిరి రాజకీయాలు జోరుగా సాగాయి. వరుస విజయాలతో ఆయన దూసుకుపోవాలని అనుకున్నా.. గత ఎన్నికల్లో సొంత సామాజిక వర్గం ఆయనకు దూరమైంది. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు మీడియా ముందుకు వచ్చినా.. తర్వాత సైలెంట్ అయ్యారు. దీనికి కారణం వేరే ఉందని అంటున్నారు పరిశీలకులు. పలాస అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులను మంత్రిగా ఉన్న సమయంలో దారి మళ్లించారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి.
దీనిపై ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టి పెట్టారు. ఎక్కడ ఎంత మేరకు నిధులు దారిమళ్లాయన్న విషయంపై ఆమె కూపీ లాగుతున్నారు. ఈ విషయాలు ఇంకా బయటకు పొక్కక ముందే.. మాజీ మంత్రి తనంతట తానే సైలెంట్ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఎక్కడా ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయడం కానీ.. నియోజకవర్గంలో ప్రెస్ మీట్లు పెట్టడం కానీ చేయడం లేదు. దీని వెనుక ఆయన భయపడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు.. వైసీపీలోనూ.. సీదిరిని వ్యతిరేకిస్తున్న వర్గం.. ఈ విచారణ ఎంత త్వరగా జరిగితే అంత బాగుం టుందని కోరుకుంటుండడం గమనార్హం. అధికారంలో ఉన్నప్పుడు.. తమను పట్టించుకోలేదన్న ఆవేదన వారిలో ఉండడం.. సీదిరి మార్పు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే కూడా .. సమయం చూసుకుని సీదిరిపై చర్యలు తీసుకునేలా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలోనే వైసీపీ నాయకులకు కూడా అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారట. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.