అవును.. శని గ్రహానికి ఏలినాటి ‘శని’

సౌర కుటుంబంలో ఇతర గ్రహాలకు భిన్నంగా.. చుట్టూ అందమైన ఏడు వలయాలు శని గ్రహం స్పెషల్ అన్న సంగతి తెలిసిందే.

Update: 2023-11-08 17:30 GMT

చదివినంతనే సిత్రంగా అనిపించటంతో పాటు.. మనసులోకి చప్పున మెదిలే మాట.. ‘శనికి ఏలినాటి శని పట్టిందా?’ అని. శని ఏమిటి? ఏలి నాటి శని ఏమిటి? ఈ రింగులేమిటి? ఈ గోలేంది? అంతా.. కన్ఫ్యూజింగ్ గా ఉందనిపించొచ్చు. విషయాన్ని వివరంగా తెలిస్తే మాత్రం కాసింత ఆశ్చర్యానికి గురి కాక మానదు. ఇంతకూ విషయం ఏమంటే..

హిందువులకు.. మరీ ముఖ్యంగా భారతీయులకు శని గ్రహం గురించి ఎంతో కొంత ఐడియా ఉంటుంది. శని గ్రహం గురించి అవగాహన లేకున్నా.. శని.. ఏలినాటి శని అన్న మాటలు మాత్రం అందరి నోటి నుంచి వినిపిస్తూ ఉంటాయి. మనిషి జీవితం బాగోనప్పుడు.. అనుకున్నవి జరగనప్పుడు ఏలినాటి శని పట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. మనిషి సంగతి తర్వాత.. ఇటీవల గుర్తించిన ఒక శాస్త్రీయ అంశం ఆసక్తికరంగా మారింది. శనికే ఏలినాటి శని పడితే.. అన్నట్లుగా ఉండే ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది.

సౌర కుటుంబంలో ఇతర గ్రహాలకు భిన్నంగా.. చుట్టూ అందమైన ఏడు వలయాలు శని గ్రహం స్పెషల్ అన్న సంగతి తెలిసిందే. మిగిలిన గ్రహాలకు ఈ గ్రహం ప్రత్యేకంగా నిలపటానికి ఈ ఏడు వలయాలు కూడా కారణంగా చెప్పొచ్చు. అలాంటి ఈ గ్రహానికి చెందిన ఏడు వలయాలు ఏడేళ్ల పాటు కనిపించకుండా పోతాయన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదంతా చదివినంతనే.. శనికి ఏలినాటి శని మొదలైందా? అన్న భావన మనసుకు కలుగక మానదు.

ఇంతకూ ఎందుకిలా? అంటే.. నిజానికి ఈ వలయాలు మాయం కావు కానీ.. మనిషి కళ్లకు మాత్రం కనిపించవు. కంటికి సంబంధించిన ఒక భ్రాంతి కారణంగా ఏడేళ్ల పాటు మానవులకు శని గ్రహం చుట్టూ ఉండే అందమైన ఏడు వలయాలు కనిపించని పరిస్థితి. భూమి నుంచి శని గ్రహాన్ని చూసినప్పుడు శని గమనంలోనూ.. దాని కోణంలో సాపేక్షికంగా మార్పులు ఉంటాయి. ఇవి ఒక దశ దాటిన తర్వాత ఆ వలయాలు మనిషి కంటికి కనిపించకుండా పోతాయి.

ప్రస్తుతం భూమి నుంచి శని వంపును చూస్తే.. 9 డిగ్రీల దిగువునకు ఉంది. వచ్చే ఏడాది ఇది కాస్తా 3.7 డిగ్రీలకు తగ్గుతుంది. అదే 2025 నాటికి ఇది సున్నాకు పడిపోతుంది. ఈ టైంలో శని వలయాలు భూమికి సమాంతరంగా ఒక సన్నటి రేఖలా ఉంటాయి. ఇంత సన్నటి రేఖల్ని కంటితో చూడటం సాధ్యం కాదు. ఇది మరింత స్పష్టంగా అర్థం కావాలంటే.. ఒక చీపురు పుల్లను మనం దగ్గర నుంచి చూసినప్పుడు కనిపిస్తుంది. దానికి దూరంగా వెళ్లే కొద్దీ ఆ చీపురు పుల్ల కంటికి కనిపించదు. ఇప్పుడు జరిగేది కూడా అదే.

కంటికి కనిపించదు కానీ.. శని చుట్టూ ఉండాల్సిన ఏడు వలయాలు అలానే కంటిన్యూ అవుతుంటాయి. 2032 నాటికి తిరిగి 27 డిగ్రీల వంపునకు చేరుకున్నంతనే భూమి నుంచి ఈ వలయాల్ని చూడగలిగే పరిస్థితి ఉంటుంది. సూర్యుడు చుట్టూ ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేయటానికి శనికి 29 సంవత్సరాల 6 నెలల టైం పడుతుంది. ఇంతకూ శని చుట్టూ ఉండే ఆ వలయాల్లో ఏం ఉంటుందన్న విషయంలోకి వెళితే.. మంచు.. రాల్లు.. ధూళితో కూడి ఉంటాయని.. వాటిల్లో గ్రహశకలాలు.. తోకచుక్కలు.. ఉపగ్రహ శకలాలు కూడా ఉంటాయి. శని వలయాలు శాశ్వితం కాదు. మరో 30 కోట్ల సంవత్సరాల వ్యవధిలో వలయాలు పూర్తిగా కనుమరుగు అయిపోతాయి. ఎందుకంటే.. వాటిల్లోని పెద్ద పెద్ద భాగాలు శని గ్రహంలో కలిసిపోవటమే దీనికి కారణంగా చెప్పొచ్చు.

Tags:    

Similar News