ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వాటికి స్వయంప్రతిపత్తి!
దేవాలయాల ఆచారా, వ్యవహారాల్లో ఆ శాఖ కమిషనర్ పెత్తనానికి వీలు లేదని, అంతా వైదిక, ఆగమశాస్త్రాల ప్రకారమే జరగాలని ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఏపీలోని హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఆలయాల్లో పలు చోరీలు జరిగాయి. అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఇటీవల టీటీడీ ప్రసాదంలో పెద్ద రాద్ధాంతం చోటుచేసుకుంది. ఒక రాష్ట్రాన్నే కాకుండా యావత్ దేశంలోని హిందూ ప్రజలంతా ఈ విషయమై ఆలోచనలో పడ్డారు.
ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికలకు ముందు పలు హామీలను ఇచ్చింది. వాటిని మేనిఫెస్టోలో చేర్చింది. దాంతో ప్రజలు కూడావాటిని నమ్మి టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే.. మేనిఫెస్టోలో చేర్చిన దేవాలయాల స్వయం ప్రతిపత్తి అంశానికి ఎట్టకేలకు చంద్రబాబు సర్కార్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు స్వయప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ద్వారా ఆలయాల్లో ఇక రాజకీయ, అధికార జోక్యానికి చెక్ పడుతుంది. ప్రతీ ఆలయంలోనూ వైదిక కమిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇక ఆలయంలో పూజలు, తదితర సేవలపై ఆ కమిటీ నిర్ణయం ఫైనల్ కానుంది. దేవాలయాల ఆచారా, వ్యవహారాల్లో ఆ శాఖ కమిషనర్ పెత్తనానికి వీలు లేదని, అంతా వైదిక, ఆగమశాస్త్రాల ప్రకారమే జరగాలని ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతీ దేవాలయంలోనూ వైదిక కమిటీ చెప్పిన వాటిని పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. సదరు కమిటీ సూచనలు, సలహాలను కమిషనర్ సహా అధికారులు అందరూ అమలు చేయాల్సి ఉంటుంది. వీటికితోడు ఆలయాల్లో కొత్త సేవలు ప్రారంభించడం, వాటికి సంబంధించిన ఫీజులు కూడా కమిటీనే నిర్ణయించనుంది. కల్యాణ మహోత్సవాలు, వాటి ముహూర్తాలు, యాగాలు, కుంభాభిషేకాలు, కొత్త పూజలు ప్రారంభం.. ఇతర ఏవి అయినప్పటికీ కూడా వైదిక కమిటీ లేదా ఆలయ ప్రధాన అర్చకులే సూచిస్తారు. ఒకవేళ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయితే.. ఆగమాలకు సంబంధించిన పీఠాధిపతుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం నిర్దేశించింది.