హిండెన్ బర్గ్ పై సెబీ చీఫ్ రియాక్షన్... ఆరోపణలకు అసలు కారణం ఇదేనంట!
అవును... హిండెన్ బర్గ్ తమపై చేసిన ఆరోపణలపై మాధబి దంపతులు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజాగా సెబీ ఛైర్ పర్సన్ మాధబి పురి బచ్ పై హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్ లలో మాధబి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది.
ఇదే సమయంలో... అదానీకి చెందిన మారిషస్, ఆఫ్ షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని వెల్లడించింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ పై నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా పోయాయంటూ కూడా కామెంట్ చేసింది.
ఈ నేపథ్యంలో... మాధబి పుర్, ధావల్ బచ్ దంపతుల వాటాల నికర విలువ 10 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 83 కోట్లు) వరకూ ఉండొచ్చని హిండెన్ బర్గ్ తెలిపింది. ఈ స్థాయిలో హిండెన్ బర్గ్ తమపై సంచల ఆరోపణలు చేయడంపై సెబీ ఛైర్ పర్సన్ మాధబి పురి బచ్ స్పందించారు.
అవును... హిండెన్ బర్గ్ తమపై చేసిన ఆరోపణలపై మాధబి దంపతులు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా హిండెన్ బర్గ్ తమపై వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో... తమ జీవితం తెరిచిన పుస్తకం అని.. ఏశాఖ అధికారులు కోరినా ఏ ఆర్థిక కార్యకలాపాల వివరాలు అయిన వెల్లడించేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.
‘‘మా జీవితం తెరిచిన పుస్తకం. ఇప్పటికే కొన్నేళ్లుగా అన్ని రకాల వివరాలను మేం సెబీకి సమర్పించాం. ఏ శాఖ అధికారులు కోరినా.. మేం ప్రైవేటు వ్యక్తులుగా ఉన్న రోజుల్లోని ఏ ఆర్థిక కార్యకలాపాల వివరాలు వెల్లడించేందుకైనా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. రానున్న రోజుల్లో మా ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి సమగ్ర ప్రకటన జారీ చేస్తాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
వాస్తవానికి హిండెన్ బర్గ్ పై సెబీ చర్యలు తీసుకొని, షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోనే ఆ సంస్థ తమపై వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తుందని, ఇది చాలా దురదృష్టకరమని మాధబి దంపతులు ఆరోపించారు.