ఏపీ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం.. ఇక రిజిస్ట్రేషన్లు ఇలా!

ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2023-08-31 05:43 GMT

ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ నుంచి రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమలు చేయనుంది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నామని.. 15వ తేదీ నాటికి దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న కార్డ్‌ 1.0 సాఫ్ట్‌వేర్‌ స్థానంలో కార్డ్‌ 2.0 వెర్షన్‌ ను ప్రవేశపెట్టినట్టు వెల్లడించింది.

ప్రస్తుతం ఉన్న విధానంలో యజమానులు తాము తయారుచేసుకున్న దస్తావేజులను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని ప్రభుత్వం గుర్తు చేసింది. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద ప్రజలు వేచి ఉండాల్సిన అవసరం ఉండదని తెలిపింది. తద్వారా ప్రజలకు విలువైన సమయం ఆదా అవుతుందని పేర్కొంది.

రిజిస్ట్రేషన్ల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన కార్డ్‌ 2 వెర్షన్‌ లో వినియోగదారులు దస్తావేజులను ఆన్‌లైన్‌ లో తయారుచేసుకోవచ్చు. దీనివల్ల పేర్లు, తదితర వివరాల్లో తప్పులు దొర్లే అవకాశం ఉండదు. అంతేకాకుండా ఆన్‌లైన్‌ లోనే స్లాట్‌ బుక్‌ చేసుకుని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు. ఇలా కాకపోయినా కూడా తాము తయారు చేసుకున్న దస్తావేజు సాఫ్ట్‌ కాపీని అప్‌ లోడ్‌ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్లాట్‌ బుక్‌ చేసుకుని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్‌ చార్జీల వివరాలను కూడా వినియోగదారులే సొంతంగా లెక్కించుకోవచ్చని, ఆ చార్జీలను సులువుగా ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా చెల్లించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. రిజిస్ట్రేషన్‌ కోసం తమకు కుదిరే టైమ్‌ స్లాట్‌ బుక్‌ చేసుకొని కేవలం 20 నిమిషాల్లోనే పని పూర్తిచేసుకోవచ్చని తెలిపింది. రిజిస్ట్రేషన్‌ తర్వాత 20 నిమిషాల్లోనే దస్తావేజులు కూడా అధికారులు జారీ చేస్తారని వివరించింది.

ఆధార్‌ లింక్‌ చేయడం వల్ల తప్పుడు రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. దస్తావేజుల తయారీదారులు, లేఖరులు, న్యాయ నిపుణులకు కొత్త విధానం వల్ల పని సులువు అవుతుందని పేర్కొంది. కొత్త విధానం ప్రవేశపెట్టడం వల్ల వారి ఉపాధి పోతుందనేది అపోహ మాత్రమేనని తెలిపింది. కొత్త రిజిస్ట్రేషన్ల విధానంలో వినియోగదారులు.. మధ్యవర్తులపై ఆధారపడకుండా తమ రిజిస్ట్రేషన్‌ను తామే సులువుగా పూర్తి చేసుకోవచ్చని వివరించింది.

అలాగే కొత్త విధానంలో వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక మళ్లీ వ్యక్తిగతంగా తహశీల్దార్‌ కార్యాల­యాన్ని మ్యుటేషన్‌ కోసం సంప్రదించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌ జరిగేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని ఈ విధానాన్ని రూపొందించామని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ల కోసం దస్తావేజులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ లో కూడా అధికారులకు సమర్పించే అవకాశం ఉందని తెలిపింది.

ప్రస్తుతం పెరిగిన ప్రజల అవసరాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ సేవలను వేగంగా, నాణ్యంగా, సురక్షితంగా పూర్తి చేయడానికి కొత్త రిజిస్ట్రేషన్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కొత్త విధానంలో యజమానుల సంతకాలతో ఉండే భౌతిక దస్తావేజులు పూర్తిగా కనుమరుగవుతాయనేది కేవలం అపోహ మాత్రమే­నని స్పష్టం చేసింది.

Tags:    

Similar News