షర్మిల కాంగ్రెస్ లోకి...విజయమ్మ ఎటు వైపు....!?

మరి ఆమె వెంట ఉంటూ ఆమె రాజకీయాలలో సాయం చేస్తాను అని చెప్పిన వైఎస్ విజయమ్మ రాజకీయం ఏ వైపు అన్నది ఇపుడు చర్చకు వస్తోంది.

Update: 2023-12-29 03:45 GMT

వైఎస్సార్ తనయ షర్మిల కాంగ్రెస్ బాట పడుతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. జనవరి మొదటి వారంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్సార్టీపీని విలీనం చేస్తారని అంటున్నారు. అదే జరిగితే షర్మిల పక్కా కాంగ్రెస్ మనిషి అయినట్లే. ఖద్దరు పార్టీలో ఆమె మెంబర్ అయినట్లే.

మరి ఆమె వెంట ఉంటూ ఆమె రాజకీయాలలో సాయం చేస్తాను అని చెప్పిన వైఎస్ విజయమ్మ రాజకీయం ఏ వైపు అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. వైఎస్ విజయమ్మ వైసీపీ పెట్టినప్పటి నుంచి అందులో గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ వస్తున్నారు. అయితే వైఎస్ షర్మిల తెలంగాణాలో కొత్త పార్టీ పెట్టాక ఆమె అందులో కనిపిస్తూ వచ్చారు ఇక ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ 2022 జూలై 8న గుంటూరులో జరిగినపుడు అందులో తన రాజీనామా నిర్ణయం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆమె చెప్పినది ఏంటి అంటే కష్టాలలో ఒక బిడ్డ ఉందని ఆమెకు తన అండ అవసరం అని అందుకే వైసీపీని వీడుతున్నాను అని. అయితే షర్మిల సొంతంగా పార్టీ నడిపినట్లు అయితే విజయమ్మ అండ అవసరం కానీ ఆమె మహా సముద్రం లాంటి కాంగ్రెస్ లో చేరుతారు అన్న వార్తల నేపధ్యంలో ఆమెకు ఇపుడు ఎవరి అండా అవసరం లేదు

ఇక షర్మిల అయితే కాంగ్రెస్ పార్టీ తన అన్నను జైలులో పెట్టించింది సీబీఐ కేసులు పెట్టించింది అని అప్పట్లో ఘాటైన విమర్శలు చేశారు. విజయమ్మ కూడా కాంగ్రెస్ మీద విమర్శలు చేశారు. సరే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అని షర్మిల భావించి కాంగ్రెస్ లో చేరవచ్చు. విజయమ్మ ఏమి చేస్తారు అన్నదే ప్రశ్నగా ఉంది.

ఆమె తిరిగి వైసీపీలో చేరుతారా అన్నది కూడా ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఆమె ఎపుడు చేరినా ఓకే అన్నది కూడా వైసీపీ అధినాయకత్వం మాటగా ఉంది అంటున్నారు. ఇటీవల పులివెందులలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో జగన్ తో కలసి విజయమ్మ పాల్గొన్నారు. ఆమెకు కుమారుడు కుమార్తె సమానమే. దాంతో ఆమె ఇపుడు తన సహకారాన్ని తిరిగి వైసీపీకి ఇస్తారా అన్నది కూడా చూడాలని అంటున్నారు

రేపటి రోజున ఎన్నికలు ముంచుకుని వస్తున్నాయి. వైసీపీ తరఫున 2019 ఎన్నికల్లో విజయమ్మ ప్రచారం చేశారు. జగన్ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని కూడా ఆమె చెప్పుకొచ్చారు. అనేక ఇంటర్వూలలో సైతం ఆమె వైసీపీ పాలన బాగుందని కూడా కితాబులు ఇస్తున్నారు. దాంతో ఆమె వైసీపీ తరఫున ప్రచారానికి రావచ్చు అని కొందరు అంటూంటే ఆమె ఇక రాజకీయాలకు సెలవు ప్రకటించి విశ్రాంతి తీసుకుంటారు అని అంటున్నారు.

ఏది ఏమైనా వైఎస్సార్ మరణాంతరం దాదాపుగా పుష్కర కాలం పాటు జనంలోకి వచ్చి తనదైన శైలిలో రాణించిన విజయమ్మ రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటిసారి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. రెండవసారి 2014 ఎన్నికల్లో ఆమె విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2019లో ఆమె ఎన్నికలలో పోటీ చేయలేదు. మొత్తానికి ఆమె రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారనే ఎక్కువ మంది అంటున్న మాట.

Tags:    

Similar News