హైదరాబాద్‌లో శంకర్ దాదా ఎంబీబీఎస్‌లు.. ఎంత మంది ఉన్నారంటే..?
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వీరి సంఖ్య వందకుపైగానే ఉన్నట్లు వెల్లడైంది.
ప్రజల ఆరోగ్యంతో కొంత మంది నకిలీ వైద్యులు ఆటలాడుతున్నారు. అక్కడ ఇక్కడ అని కాకుండా ఎక్కడ చూసినా నకిలీ వైద్యులు పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. ఒకప్పుడు పల్లెల్లోనే కనిపించే నకిలీ వైద్యులు పట్టణాల్లోనూ పెరిగిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వీరి సంఖ్య వందకుపైగానే ఉన్నట్లు వెల్లడైంది.
అన్నింటా అభివృద్ధి సాధిస్తూ దూసుకెళ్తున్న హైదరాబాద్ మహానగరం నకిలీ వైద్యులకు అడ్డాగా మారుతోంది. ప్రజల అనారోగ్యాన్ని ఆసరా చేసుకుని చాలా మంది నకిలీ వైద్యులు పుట్టుకొస్తున్నారు. ఎలాంటి సర్టిఫికెట్లు లేకున్నా నాడీ పట్టి తెలియని వైద్యం అందిస్తున్నారు. చాలా మంది రోగులు ప్రాణాలు కోల్పోయేందుకు కారణం అవుతున్నారు. మరికొందరి ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. చివరకు పేషెంట్ సీరియస్ అని చావు కబురు చల్లగా చెప్పి ఇతర ఆసుపత్రులకు పంపిస్తున్నారు. నగరం వ్యాప్తంగానూ ఈ ఫేక్ గాళ్లు విస్తరించారు.
ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఇప్పటివరకు వంద మంది నకిలీ డాక్టర్ల గుట్టురట్టయింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో ఈ భయంకర నిజాలు బయటపడ్డాయి. ఎంబీబీఎస్ కానీ.. ఇతర ఎలాంటి పత్రాలు లేకుండానే ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. డెంటల్ డిగ్రీ పొందిన ఓ వైద్యురాలు నాగోలులో క్లినిక్ నిర్వహిస్తోంది. డెంటల్ పేరిట పర్మిషన్ పొంది.. ఏకంగా చర్మ వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. డెర్మటాలజిస్టులు చేయాల్సిన కాస్మటాలజీ వైద్యాన్ని, హెయిర్ ట్రాన్స్‌పాంట్ చేస్తున్నట్లు తనిఖీల్లో వెలుగు చూసింది.
తిరుమలగిరిలో మరో నకిలీ వైద్యుడు ప్రాక్టీస్ ప్రారంభించాడు. రోగులకు ఇష్టం వచ్చినట్లుగా యాంటిబయోటిక్ ఇంజక్షన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నాడు. మోతాదుకు మించి ఇస్తున్నట్లుగా గుర్తించారు. దాంతో అతనిపై కేసు నమోదు చేశారు. మరోవ్యక్తి ఏకంగా విదేశాల్లో ఎంబీబీఎస్ చదివినట్లుగా ఎండీ అని బోర్డు పెట్టి వైద్యసేవ చేస్తున్నాడు. ఈయన చర్మ వ్యాధి నిపుణుడిగా చలామణి అవుతున్నాడు. వైద్యులుగా చలామణి అవుతున్న వీరి వద్ద ఎలాంటి పట్టాలు లేవు. ఇక కొందరేమో నకిలీ పట్టాలు సృష్టించి వాటిని లామినేషన్ చేయించి క్లినిక్‌లలో పెడుతున్నారు. ఇక.. నకిలీ వైద్యులు ఇలా పుట్టుకొస్తుంటే.. నకిలీ మెడికల్ షాపులు కూడా వందలాది సంఖ్యలో వెలుగుచూస్తున్నారు. దాదాపు 140 వరకు ఇలాంటి దుకాణాలను ఔషధ నియంత్రణ శాఖ గుర్తించింది. ఇదే నకిలీ వైద్యులు.. నకిలీ వైద్యం అందిస్తూనే నకిలీ మందు షాపులు పెడుతున్నారు. వాటి ద్వారా మెడిసిన్ విక్రయిస్తున్నారు. అటు హోల్‌సెల్ డీలర్లు సైతం ఇలాంటి క్లినిక్‌లకు మెడిసిన్స్ సరఫరా చేస్తున్నారు. మరోవైపు.. పెద్ద పెద్ద ఆసుపత్రులకు వెళ్తే కన్సల్టెన్సీ ఫీజు ఎక్కువ అవుతుందని.. వ్యాధుల బారిన పడిన వారు వీరినే ఆశ్రయిస్తుండడం మరింత ఆందోళన కలిగించే అంశం. వారికి ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్స్, నకిలీ మందులు అందిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ప్రజలు సైతం అలర్ట్‌గా ఉండాలని, లేదంటే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం లేకపోలేదని వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది.