రతన్ టాటా యంగ్ ఫ్రెండ్ శంతను నాయుడికి కీలక బాధ్యతలు

దిగ్గజ పారిశ్రామిక వేత్త, దివంగత రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు, యువ స్నేహితుడు శంతను నాయుడికి టాటా మోటార్స్ లో కీలక బాధ్యతలు అప్పగించారు.

Update: 2025-02-04 17:20 GMT

దిగ్గజ పారిశ్రామిక వేత్త, దివంగత రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు, యువ స్నేహితుడు శంతను నాయుడికి టాటా మోటార్స్ లో కీలక బాధ్యతలు అప్పగించారు. వీధి శునకాలపై ప్రేమతో రతన్ టాటాకు దగ్గరైన శంతను నాయుడు ఆయనకు కేర్ టేకర్ గా బాధ్యతలు చూసేవారు. టాటా ట్రస్టులో జనరల్ మేనేజరుగానూ విధులు నిర్వహించేవారు. 80 ఏళ్ల రతన్ టాటాతో 18 ఏళ్ల శంతను నాయుడు స్నేహం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఇద్దరి అభిలాష మూగజీవాలను రక్షించడమే కావడంతో రతన్ చివరి క్షణం వరకు కలిసివుండే అవకాశమిచ్చింది. అయితే రతన్ టాటా కన్నుమూసిన తర్వాత కూడా శంతను టాటా ట్రస్ట్ లోనే కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఆయనకు టాటా మోటార్స్ లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ కు జనరల్ మేనేజర్ గా కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ విషయాన్ని శంతను నాయుడే తన లింక్డ్ ఇన్ పోస్ట్ లో స్వయంగా ప్రకటించారు.

రతన్ మరణంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన శంతను నాయుడు తన విచారాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘‘మీ నిష్క్రమణతో మన స్నేహం శూన్యం మిగిల్చింది. ఆ లోటును అధిగమించడానికి జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరమవడంతో కలిగిన దు:ఖం పూడ్చలేనిది. గుడ్ బై మై డియర్ లైట్ హౌస్’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. యువకుడైన శంతను 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంటుగా వ్యవహరించారు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడటంతో శంతనును ఎక్కువగా ప్రోత్సహించేవారు రతన్ టాటా. శంతను కూడా రతన్ టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడిగా మెలిగేవారు. గత ఏడాది అక్టోబరులో రతన్ టాటా మరణించేవరకు ఆయన పక్కనే ఉండేవాడు శంతను.

ఇక టాటా గ్రూపులో కీలక పదవి దక్కించుకున్న శంతను ఆనందం వ్యక్తం చేశాడు. టాటా మోటార్స్ లో బాధ్యతలు వ్యక్తిగతంగా కూడా తనకు ఒక కీలకమలుపుగా అభివర్ణించాడు. ‘‘నా తండ్రి టాటా మోటార్స్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు తెల్లటి చొక్కా, నేవీ ప్యాంటుతో నడుస్తూ వచ్చేవారు. ఆ క్రమంలో నేను కిటికీలో ఎదురుచూసేవాడిని’’ అని శంతను గుర్తు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ రోజు పూర్తిగా మారిపోయింది. ఈ భావోద్వేగపూరిత క్షణం ద్వారా టాటా మోటార్స్ తో తన కుటుంబానికి ఉన్న సంబంధాన్ని తన పోస్టులో వివరించారు శంతను.

Tags:    

Similar News