ఆసీస్ ఆతిథ్యం దారుణం... కెప్టెన్ పై శార్దూల్ సంచలన వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో స్పందించిన శార్దుల్ ఠాకూర్... అప్పటి ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా అతడిని అబద్ధాల కోరుగా అభివర్ణించాడు.
వచ్చే నవంబర్ నుంచి ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ మ్యాచ్ ల షెడ్యూల్ ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రిందట సిరీస్ గురించి టీం ఇండియా ఆటగాడు శార్దుల్ ఠాకూర్ కీలక వ్యఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఆతిథ్యంపైనా ఫైరయ్యాడు.
అవును... నాలుగేళ్ల కిందట టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ సమయంలో ఆ సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆ ఒత్తిడి ఈసారి వారిపై బలంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన శార్దుల్ ఠాకూర్... అప్పటి ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా అతడిని అబద్ధాల కోరుగా అభివర్ణించాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన శార్ధుల్.. నాటి పర్యతనలో తమను ట్రీట్ చేసిన విధానం అత్యంత దారుణం అని.. ఒక్కోసారి నాలుగైదు రోజులపాటు హౌస్ కీపింగ్ సేవలు కూడా ఉండేవి కావని.. ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియాకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని అన్నాడు. బెడ్ షీట్ మార్చాలని కోరినా ఫలితం శూన్యం అని తెలిపాడు.
ఇదే సమయంలో నాటి ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ మాత్రం పెద్ద అబద్దాల కోరని.. అతడు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలన్నీ అవాస్తవాలని.. తమ పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకే అలాంటి వ్యాఖ్యలు చేశాడని వెల్లడించాడు. అసలు వాస్తవాలేమిటనేది కనీస మౌళిక సదుపాయాల కోసం పోరాడిన తమకు తెలుసని వివరించాడు. నాటి అనుభవాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆ సిరీస్ లో కెప్టెన్ గా ఉన్న కోహ్లీ స్వదేశానికి వెళ్లిన తర్వాత తాత్కాలిక కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన రహానె, హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ సమస్యలపై నిరంతరం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో పోరాడారని శార్దూల్ గుర్తుచేసుకున్నాడు. దీంతో... ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. క్రికెట్ ఆస్ట్రేలియా తీరు ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
కాగా... ఆ సిరీస్ లో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై టీమిండియా ఓడించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ కొహ్లీ అర్ధాంతరంగా ఇండియాకు వెళ్లాల్సి వచ్చినా.. సిరీస్ లో తొలుత వెనుకబడినా.. తర్వాత పుంజుకుని 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది.