జగన్ డిక్షనరీలో ఆ రెండూ లేవు... షర్మిల స్ట్రాంగ్ ఎటాక్!

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మీద సొంత చెల్లెలు, ఏపీసీసీ ఆధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు.

Update: 2025-02-07 17:11 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మీద సొంత చెల్లెలు, ఏపీసీసీ ఆధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. జగన్ నైజం ఇదీ అని మీడియా సాక్షిగా బట్టబయలు చేశారు. తన ఇంటికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చి చెప్పిన విషయాలను ఆమె మీడియాకు చెప్పారు. ఆస్తుల కోసం సొంత చెల్లెలుని ఎలా జగన్ వెన్నుపోటు పొడిచారు అన్నది అంతా తెలుసుకోవాలని అన్నారు.

వైఎస్సార్ ఆస్తులలో తన బడ్డలకూ వాటా ఉందని కానీ షేర్ల విషయంలో అబద్ధాలు చెప్పించి జనాలను జగన్ మభ్యపెట్టారని అన్నారు. విజయసాయిరెడ్డి చేత ప్రెస్ మీట్ పెట్టించి తాను సొంతంగా డిక్టేట్ చేసిన అంశాలనే అక్కడ చెప్పాలని ఒత్తిడి తెచ్చారని అన్నారు. దాంతో విజయసాయిరెడ్డి అవన్నీ రాసుకుని మరీ మీడియా ముందుకు బలవంతంగా వచ్చి చెప్పాల్సి వచ్చిందని షర్మిల అన్నారు.

అలాగే వైవీ సుబ్బారెడ్డి మీద కూడా ఒత్తిడి తెచ్చి తనకు విజయమ్మకు వ్యతిరేకంగా మాట్లాడించారని షర్మిల ఆరోపించారు. మేనల్లుడు, మేనకోడలు ఆస్తులను కాజేయాలని కుట్ర చేసిన వ్యక్తి జగన్ అని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

సొంత తల్లి విజయమ్మ మీద కేసు వేశారని స్వార్ధం కోసం ఏమైనా చేయవచ్చు అన్న సిద్ధాంతం జగన్ ది అన్నారు. అవతల వారిని విమర్శించే ముందు నాలుగు వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయన్నది జగన్ మరచిపోతున్నారని అన్నారు. దయ్యాలు వేదాలు వల్లించడం కంటే అసహ్యంగా ఉంది జగన్ నీతులు చెప్పడం అన్నారు.

విశ్వసనీయత, విలువలు అన్న వాటి గురించి జగన్ కి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ఆయన డిక్షనరీలో ఆ రెండు పదాలు లేవని అన్నారు. జగన్ కి క్రెడిబిలిటీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. వైఎస్సార్ తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీతో అయిదేళ్ళ పాటు అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు జగన్ అన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు. జల యజ్ఞం ప్రాజెక్టులను ఆరు నెలలలో పూర్తి చేస్తామని చెప్పి అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్నారని కనీసం ప్రాజెక్టులకు మెయింటెయినెన్స్ ఖర్చులు కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు.

సంపూర్ణ మధ్యపాన నిషేధం అమలు చేస్తామని ఏపీ అంతా మద్యం మాఫియా నడిపారని, నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారని దుయ్యబట్టారు. బంగారం లాంటి కొండను గొరిగేసి రుషికొండలో తన కోసం అయిదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టారని అదేనా జగన్ కి ఉన్న విశ్వసనీయత అని ప్రశ్నించారు.

సొంత చిన్నాన్నను హత్య చేయించాడు అని సీబీఐ చెప్పినా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తన పక్కన పెట్టుకుని జగన్ తిరిగారు అని ఫైర్ అయ్యారు. పైన వైఎస్సార్ ఫోటో పెట్టుకుని వివేకా హత్య కేసుని నీరు కార్చారని అన్నారు. తాను వైసీపీని అధికారంలోకి తీసుకుని రావడం కోసం ఎంతో కష్టపడితే తన పిల్లలకు కూడా ఆస్తులు దక్కకుండా చేయాలని చూశారని జగన్ మీద మండిపడ్డారు. సొంత తల్లి విజయమ్మని కూడా ఆఖరుకు అవమానించారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

అయిదేళ్ళు సీఎం గా ఉండగా ఒక్క రోజూ ప్రజా దర్బార్ నిర్వహించని జగన్ కి వైఎస్సార్ కి పోలిక లేనే లేదని అన్నారు. జగన్ కి ఉన్నది క్రెడిబిలిటీ కాదు డబ్బు ఉందని అహంకారమని అన్నారు. మొత్తానికి షర్మిల జగన్ కి ధీటుగా ఘాటుగా ఇచ్చిన కౌంటర్ అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

Tags:    

Similar News