సాక్షి మీడియాకు ఇచ్చి పడేసిన షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పసుపు పచ్చ చీర కట్టుకున్న సందర్భంలో సైతం ఆమెను వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా దారుణంగా విమర్శించిన సంగతి తెలిసిందే.;

Update: 2025-04-07 14:05 GMT
YS Sharmila Slams YSRCP

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పసుపు పచ్చ చీర కట్టుకున్న సందర్భంలో సైతం ఆమెను వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా దారుణంగా విమర్శించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు, టీడీపీకి షర్మిల అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరిగింది. షర్మిల ఏం మాట్లాడినా టీడీపీ స్క్రిప్ట్ అని విమర్శిస్తున్న వైనంపై తాజాగా షర్మిల స్పందించారు. వైసీపీ, వైసీపీని మోసే మీడియా సంస్థలకు పచ్చ కామెర్ల రోగం తగ్గలేదంటూ సాక్షి మీడియాపై షర్మిల విమర్శలు గుప్పించారు. తనపై ఇటీవల ప్రసారం చేసిన ఓ వీడియోను ఉదాహరణగా చూపిస్తూ షర్మిల ఫైర్ అయ్యారు.

తాను అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు గారు కనిపిస్తున్నారని, ఏది చేసినా అర్థం, పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనం అని షర్మిల మండిపడ్డారు. ప్రజల గొంతు వినిపిస్తూ బలం పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం వారి చేతకానితనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినా వారి నీచపు చేష్టలు మారలేదని, ఈ జన్మకు మారరని విమర్శించారు.

ఎవరి సేవలో ఎవరు తరించారో, ఎవరికి ఎవరు దత్తపుత్రుడిగా ఉన్నారో అందరికీ తెలుసని జగన్, మోదీల బంధంపై షర్మిల సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రయోజనాలను మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన జగన్..స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుని ప్యాలెస్ లు కట్టుకున్నారని, సొంత ఖజానాలు నింపుకున్నారని విమర్శించారు. మోదీ దోస్తులకు రాష్ట్రాన్ని దోచి పెట్టారని, ఐదేళ్లు మోదాని సేవలో తరించారని ఆరోపించారు.

అలా ఎవరో ఒకరి సేవలో తరించాల్సిన ఖర్మ వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిలకు పట్టలేదని, పులి బిడ్డ పులి బిడ్డేనని చెప్పారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని, అన్ని పార్టీలు బీజేపీకి గులాంగిరి చేసేవేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తోందని అన్నారు. అసెంబ్లీకి పోయే దమ్ము వైసీపీకి లేకపోవడంతో బయట ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతోంది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు.

వక్ఫ్ బిల్లుపై కూటమి పార్టీలను తాము విమర్శించినా వైసీపీకి కనపడదని దుయ్యబట్టారు. అసెంబ్లీ వేదికగా సూపర్ సిక్స్ మోసాలను వైసీపీ ఎందుకు ఎండగట్టలేదని ప్రశ్నించారు. ఈ నీచపు కుయుక్తులతో, పాపపు సొమ్మును ఎర వేసి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలని కుట్ర పన్నుతున్నారని, ప్రజా సమస్యలపై వైసీపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

Tags:    

Similar News