పక్కా ప్రిపరేషన్ తో షర్మిల.. ఆన్ ప్లాన్డ్ గా జగన్ టీం

తనకు ఇవ్వాల్సిన ఆస్తుల విషయంలో షర్మిల పక్కాగా ఉండటమే కాదు.. ప్లానింగ్ విషయంలోనూ ఫుల్ గా ప్రిపేర్ అయినట్లుగా ఆమె తీరు కనిపిస్తోంది.

Update: 2024-10-30 14:30 GMT

యుద్ధానికి సిద్ధమన్నట్లుగా ఒకరు.. ఎలాంటి ముందస్తు వ్యూహం లేకుండా.. అప్పటికప్పుడు ఎదురయ్యే పరిణామాలకు తగినట్లు స్పందిస్తూ.. మీదకు వచ్చే అస్త్రానికి బదులైన అస్త్రాన్ని సంధించటం తప్పించి మరే మార్గం లేదన్నట్లుగా మరొకరు ఉన్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇదంతా వైఎస్ కుటుంబంలో నెలకొన్న ఆస్తుల పంచాయితీ నేపథ్యంలో ఆవిష్క్రతమైన ద్రశ్యంగా చెప్పాలి. తనకు ఇవ్వాల్సిన ఆస్తుల విషయంలో షర్మిల పక్కాగా ఉండటమే కాదు.. ప్లానింగ్ విషయంలోనూ ఫుల్ గా ప్రిపేర్ అయినట్లుగా ఆమె తీరు కనిపిస్తోంది.

ఒకటి తర్వాత ఒకటి చొప్పున తన అమ్ములపొదిలోని అస్త్రాల్ని తీస్తున్న షర్మిల తాకిడికి జగన్ తట్టుకోలేని పరిస్థితి. కుటుంబంలో కలహాలన్న విషయాన్ని ప్రత్యర్థి మీడియాలో ప్రముఖంగా వచ్చిన తర్వాత నుంచి ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకోవటం చూస్తున్నదే. అయితే.. ఈ వ్యవహారంలో జగన్ తొందరపడ్డారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. షర్మిల వద్ద ఉన్న విజయమ్మ అస్త్రం ముందు వైవీ సుబ్బారెడ్డి.. విజయసాయి రెడ్డి లాంటి అస్త్రాలు ఎన్ని ఉన్నా పెద్దగా ఉపయోగం లేని పరిస్థితి.

ఆస్తుల విషయంలో తల్లి విజయమ్మ.. చెల్లి షర్మిల మీద జగన్ చేస్తున్న న్యాయపోరాటానికి సంబంధించిన వివరాలు ఎప్పుడైతే ప్రత్యర్థి పార్టీ ద్వారా బయటకు వచ్చాయో.. ఈ ఇష్యూ మీద జగన్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ.. అదేమీ పట్టించుకోనట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన వాదనతో షర్మిల అస్త్రాలకు కౌంటర్లు ఇచ్చారే తప్పించి.. ఆమె వ్యూహం ఏమిటన్న దానిపై కాస్తంత ఆలోచించిన తర్వాత అస్త్ర ప్రయోగం చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ వ్యూహాత్మాక వైఫల్యంగా తాజా ఎపిసోడ్ ను అభివర్ణిస్తున్నారు.

ఎవరెన్ని చెప్పినా ఆస్తి విషయంలో టెక్నికల్ అంశాలు కాదు.. ఎమోషనల్ అంశాలే వర్కువుట్ అవుతాయన్న లాజిక్ ను జగన్ అండ్ కో ఎందుకు మిస్ అయ్యారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా తెర మీదకు తల్లి విజయమ్మ సంచలన లేఖతోరావటం.. ఆస్తుల విషయంలో క్లారిటీ ఇవ్వటమే కాదు.. వైఎస్ రాజశేఖర్రెడ్డి బతికుండగా పంచలేదని.. మనమడు.. మనవరాళ్లకూ సమానంగా పంచాలనేదే ఆయన ఆదేశమని.. షర్మిలకు ఇచ్చిన రూ.200 కోట్లూ డివిడెండ్లేనని.. ఒక బిడ్డకు మరో బిడ్డ అన్యాయం చేస్తున్నందునే వాస్తవాలు మాట్లాడుతున్నానని.. సుబ్బారెడ్డి.. విజయసాయిరెడ్డి చెప్పినవన్నీ అసత్యాలేనని ఆమెకుండ బద్ధలు కొట్టేశారు.

విజయమ్మ నుంచి వచ్చే కౌంటర్లకు జగన్ తో సహా ఎవరు మాత్రం తిరిగి బదులు ఇవ్వగలరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యూహాత్మక మౌనం మినహా మరో మార్గం లేదు. ఇదే తీరు.. షర్మిల వ్యవహారం బయటకు వచ్చినప్పుడే పాటించి ఉంటే ఎలా ఉండేదన్నది ప్రశ్న. ఎవరో ఏదో ముద్ర వేస్తున్నారని.. బురద జల్లుతున్నారని తొందరపాటుతో ముందుకు వెళ్లటంతోనూ సమస్యే అన్న విషయం షర్మిల ఎపిసోడ్ నేర్పే గుణపాఠంగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News