'దత్తపుత్రుడు' జగన్.. పాయింట్ తో కొట్టిన షర్మిల
బొత్స చేసిన ఎద్దేవా వ్యాఖ్యలను ఉటంకిస్తూ వైసీపీకి, జగన్ ను తూర్పారపట్టారు.
వైఎస్ షర్మిల రెచ్చిపోయారు. ఇన్నాళ్లుగా అన్న జగన్ పై ఆచితూచి మాట్లాడే షర్మిల ఈసారి కాస్త డోసుపెంచి ఇచ్చిపడేశారు. బొత్స చేసిన ఎద్దేవా వ్యాఖ్యలను ఉటంకిస్తూ వైసీపీకి, జగన్ ను తూర్పారపట్టారు. ముఖ్యంగా ఏ విమర్శను అయితే వైఎస్ జగన్ అస్త్రంగా వాడుకున్నారో అదే ‘దత్తపుత్రుడు’ బిరుదును జగన్ కు ఇచ్చేసి షర్మిల చేసిన ఆరోపణలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ప్రత్యర్థి అయిన జనసేనాని పవన్ కళ్యాణ్‌ను పూర్తిగా డిఫెన్స్ లో పడేసేలా.. అతనిని “దత్తపుత్రుడు” అని సంబోధించడం అలవాటుగా చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ప్రయోజనాల కోసం ప్రోత్సహించబడిన నాయకుడిగా చిత్రీకరించాలనే ఉద్దేశంతో జగన్ ఈ పదాన్ని ఉపయోగించారని చాలా మంది భావించారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్.., పవన్‌పై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనదా అనే సందేహాలు అప్పట్లో వచ్చాయి. అయితే ఇప్పుడు అదే విమర్శ మళ్లీ మలుపు తీసుకుంది. జగన్ తన రాజకీయ ప్రత్యర్థి పవన్ పై ప్రయోగించిన అదే “దత్తపుత్రుడు” అనే పదాన్ని, ఇప్పుడు ఆయన సొంత సోదరి షర్మిలే ఏకంగా జగన్ పై ప్రయోగించడం సంచలనమైంది.
ఇటీవల బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ “షర్మిల ఇంట్లో కూర్చొని ట్వీట్లు చేయడం తప్ప మరేం చేయడం లేదు. ఆమె చెప్పే మాటలకు స్పందించాల్సిన అవసరం మాకు లేదు” అంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై షర్మిల తీవ్రంగా స్పందించారు. “బొత్స వ్యాఖ్యలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. ప్రజల భరోసాతో అధికారంలోకి వచ్చిన వారు.. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వల్లనే నిజమైన నాయకులు అవుతారు. కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలలో జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు వ్యతిరేకంగా వెళ్లి.. మోదీ - బీజేపీకి ‘దత్తపుత్రుడు’ అయ్యారు. అందుకే ఆయన కేవలం 11 సీట్లకు పరిమితమై, ప్రతిపక్షనేత హోదా కోల్పోయారు” అని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు..
పవన్‌ను కించపరిచేందుకు జగన్ ఎన్నిసార్లు ఉపయోగించిన “దత్తపుత్రుడు” అనే పదమే ఇప్పుడు ఆయనపై తిరగబడింది. అది కూడా ఆయన సొంత సోదరి నోటి నుంచి ఈ విమర్శ రావడంతో వార్తల్లో నిలిచింది. మరొకరిని దూషించడానికి ఉపయోగించడానికి వాడే అవే పదాలు ఎప్పుడో తిరిగి తమకే తాకుతాయనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా చెబుతున్నారు.