తల్లిపై కేసు వేసిన కొడుకు.. మేనల్లుడి ఆస్తులు కాజేసిన మేనమామగా మిగిలిపోతావ్!
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సొంత అన్న, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.;

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సొంత అన్న, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ షర్మిల.. జగన్ తన తల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో మిగిలిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సరస్వతి పవర్ షేర్ల విషయంలో జగన్ స్వయంగా మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MOU)పై సంతకం చేసినప్పటికీ, ఇప్పటివరకు తనకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. "విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను జగన్ గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. మళ్లీ తనకే కావాలని కోర్టుకు వెళ్లారు. జగన్ కు విశ్వసనీయత ఉందో? లేదో? వైసీపీ వారే ఆలోచించాలి" అని ఆమె ప్రశ్నించారు.
- సునీతనూ చంపరని గ్యారంటీ ఏంటి?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ షర్మిల మరింత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై బయట తిరుగుతున్న ఎంపీ అవినాష్‌రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. విచారణాధికారిని బెదిరించి, భయపెట్టి వివేకాను ఆయన కుమార్తె సునీతే హత్య చేయించిందని తప్పుడు రిపోర్ట్ రాయించారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో ఇప్పటికే పలువురు సాక్షులు మరణించారని గుర్తు చేస్తూ, సునీతను కూడా చంపరని, ఆమెకు ప్రాణహాని లేదని గ్యారంటీ ఏంటని షర్మిల ప్రశ్నించారు. బెయిల్‌పై ఉండి సాక్ష్యాలు తారుమారు చేస్తున్న ఇలాంటి వ్యక్తులు బయట ఉండాలా? జైల్లో ఉండాలా అని ఆమె నిలదీశారు.
వివేకా హత్య జరిగిన సమయంలో సునీత, ఆమె భర్త అక్కడ లేరని, అవినాష్‌రెడ్డే అక్కడ ఉన్నారని షర్మిల స్పష్టం చేశారు. రక్తపు మరకలు తుడిపించడం వంటి పనులన్నీ ఆయనే చేయించారని అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ, తప్పు చేయలేదని రిపోర్ట్ రాయించడం దారుణమని ఆమె అన్నారు. న్యాయం కోసం పోరాడాలని సునీతకు తాను అప్పుడే చెప్పానని, ఆమెకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చానని షర్మిల తెలిపారు. ఈ విషయంలో ఎంతటి వారినైనా, తన తోబుట్టువైనా ఎదుర్కొంటానని ఆమె తేల్చి చెప్పారు.
- ప్రవీణ్ పగడాల ఘటనలో వైసీపీ రాజకీయాలు
ప్రవీణ్ పగడాల ఘటనలో వైసీపీ రాజకీయాలు చేస్తోందని షర్మిల ఆరోపించారు. పోలీసులు వీడియోలు బయట పెడుతున్నారని, ఆయన కుటుంబ సభ్యులు కూడా న్యాయం జరుగుతుందని చెబుతున్నారని ఆమె అన్నారు. ఈ విషయంలో బీజేపీ మతాల మధ్య విభజన తీసుకురావాలని చూస్తోందని, ఆ పార్టీ కుట్ర ఇందులో ఉందని తనకు అనిపిస్తోందని షర్మిల అభిప్రాయపడ్డారు. ప్రవీణ్ పగడాలది హత్య అని ఆధారాలు దొరికితే వారి పక్షాన డీజీపీని కలుస్తానని ఆమె పేర్కొన్నారు.
- వక్ఫ్ బిల్లుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి
వక్ఫ్ బిల్లు పేరుతో బీజేపీ పార్లమెంట్ వేదికగా మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని షర్మిల విమర్శించారు. ఈ బిల్లుపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు అధికారాలను ప్రత్యేక అధికారికి ఇవ్వడం ఏమిటని, బోర్డులో ముస్లిమేతరులను పెట్టడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
- డబ్బు కోసమే వైసీపీలోకి శైలజానాథ్!
తాను కనిపించడం లేదన్నది అవాస్తవమని, దానిని మెడికల్ లీవ్‌గా భావించవచ్చని షర్మిల అన్నారు. శైలజానాథ్ వైసీపీలోకి ఎందుకు వెళ్లారో తనకు తెలియదని, అక్కడ అధికారం లేదని, కేవలం డబ్బు మాత్రమే ఉందని, ఆ డబ్బు కోసమే ఆయన వెళ్లి ఉండొచ్చని ఆమె వ్యాఖ్యానించారు. వైసీపీ తమ నేతలపై దృష్టి పెట్టిందంటే కాంగ్రెస్ బలపడుతోందని అర్థమని, తమ నేతలను లాగుతున్నారంటే వారికి భయం పట్టుకుందని, తన కృషి ఫలిస్తోందని షర్మిల పేర్కొన్నారు.
మొత్తానికి షర్మిల తన సోదరుడు జగన్‌పై చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.