కుమారుడి వెడ్డింగ్ డే.. షర్మిల స్పెషల్ ట్వీట్
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా షర్మిల స్పెషల్ ట్వీట్ చేశారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా షర్మిల స్పెషల్ ట్వీట్ చేశారు. కొడుకు, కోడలిని ఆశీర్వదిస్తూ ‘‘మీ ఇద్దరూ జీవితాంతం ఆనందంగా ఉండాలని, సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నా.. మా కొడుకు, కోడల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని షర్మిల ట్వీట్ చేశారు. గత ఏడాది ఫిబ్రవరి 17న రాజస్థాన్ లోని జోద్ పూరులో రాజారెడ్డి, ప్రియా వివాహమైన విషయం తెలిసిందే..
వైఎస్ ఫ్యామిలీలో మూడో తరం పెళ్లి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. మేనల్లుడి పెళ్లికి అప్పటి సీఎం వైఎస్ జగన్ హాజరుకాలేదు. వైఎస్ కుటుంబంతోపాటు సన్నిహితులు అంతా రాజారెడ్డి పెళ్లికి వెళ్లినా, జగన్, ఆయన సతీమణి ముఖం చాటేయడంపై చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికి కారణం అప్పటికి నెల రోజుల క్రితం షర్మిల వ్యవహరించిన తీరే కారణమంటూ చర్చ జరిగింది.
2024 జనవరి 17న రాజారెడ్డి వివాహ నిశ్చితార్థం హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి షర్మిల ఆహ్వానం మేరకు జగన్ దంపతులు వెళ్లారు. అయితే నూతన వధూవరులతో జగన్ ఫొటో తీసుకోవాలని భావించగా, కుటుంబ సభ్యులను కూడా వేదికపైకి ఆహ్వానించారు. అయితే జగన్ తో ఫొటో సెషన్ కు షర్మిల దూరంగా ఉండిపోవడం, పదేపదే పిలవడంతో బలవంతంగా ఆమె వెళ్లడం అప్పట్లో వైరల్ అయింది. ఈ కారణంగానే జగన్ జోద్ పూర్ లో జరిగిన వివాహానికి వెళ్లలేదని వైసీపీ వర్గాలు ప్రచారం చేశాయి. ఇక ఈ వివాహ నిశ్చితార్థం తర్వాతే ఏపీసీసీ చీఫ్ గా షర్మిల ఏపీలో అడుగు పెట్టారు. సోదరుడు జగన్ పై తీవ్ర విమర్శలు చేసేవారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ను జగన్ రెడ్డి అంటూ పేరు పెట్టి పిలుస్తూ విమర్శించేవారు. దీంతో వైసీపీ వర్గాలు ఆమె తీరును నిరసిస్తే జగనన్న అంటూ విమర్శించవచ్చా..? అంటూ ప్రశ్నించి మరింత తీవ్రమైన వ్యాఖ్యలతో ఆరోపణలు గుప్పించేవారు.
ఇక ఇప్పుడు రాజారెడ్డి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా షర్మిల స్పెషల్ ట్వీట్ చేయడంతో అప్పడు జరిగిన ఎపిసోడ్ ను రాజకీయ ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఒక్క ట్వీట్ చరిత్రను తవ్వితీసినట్లు అవుతోందని అంటున్నారు.