జగన్ ని ముగ్గులోకి లాగుతున్న షర్మిల !

జగన్ మౌనంతో ఎవరూ సాటి రారు. పోటీ కూడా పడలేరు. ఆయనకు అది ఎంతో ఇష్టం.

Update: 2024-04-13 03:30 GMT

జగన్ మౌనంతో ఎవరూ సాటి రారు. పోటీ కూడా పడలేరు. ఆయనకు అది ఎంతో ఇష్టం. దేశంలో ఒక రాజకీయ నేతగా జగన్ కి ఉన్న ప్రత్యర్ధులు అనుకోండి శత్రువులు అనుకోండి ఎవరికీ లేరు అనే అంటారు. అంతే కాదు గడచిన పది పన్నెండేళ్ల కాలంలో జగన్ ని టార్గెట్ చేసి ఆయనను విమర్శించిన వాళ్ళు నిందించిన వాళ్ళు చూస్తే లెక్కా జమా లేదు. ఆయన మాదిరిగా ప్రత్యర్ధుల నుంచి దూషణలు అత్యధికంగా పడిన నేత కూడా మరొకరు ఉండరు.

జగన్ పొలిటికల్ ఫిలాసఫీ ఏంటి అంటే తన మీద ఎవరు విమర్శలు చేసినా పట్టించుకోకపోవడం. వారిని గుర్తించకపోవడం. మాజీ ప్రధాని దివంగత నేత పీవీ నరసింహారావు కి ఒక ఫిలాసఫీ ఉంది. మౌనం అంటేనే ఒక నిర్ణయం అని. అలాగే జగన్ కి కూడా మౌనం అంటేనే ఒక ఆయుధం అని అనుకోవాలి.

ఆయనను ఎంతలా విమర్శించినా అభిమానులు ఉగ్రమూర్తులు అవుతారు సన్నిహితులు తల్లడిల్లు తారు కానీ జగన్ మాత్రం సైలెంట్ గానే ఉంటారు. అయితే ఆ సైలెంట్ వెనక ఆయనకు ఉన్నది మౌనాగ్రహం. ఇది ధర్మాగ్రహం మాదిరిగానే అనుకోవాలేమో.

తన చెవుల దాకా ప్రత్యర్ధుల మాటను చేరనీయకపోవడం వాటిని తన మెదడులో ఉంచి వాటికి చోటు ఇచ్చి విలువ కల్పించడం వివేకవంతులు చేయరని ఒక సామెత ఉంది. జగన్ దాన్ని అక్షరాలా పాటిస్తున్నారు అనుకోవాలి. ఆయన అందుకే ఎవరు ఎంతలా దారుణంగా విమర్శించినా పట్టించుకోరు అని అంటారు.

ఆ సంగతి ఆయన సొంత చెల్లెలు షర్మిలకు తెలియనిది కాదు. కానీ ఆమె అన్నను టార్గెట్ చేసుకుని మరీ విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు పదును పెడుతున్నారు. అది ఎంతదాకా వెళ్ళింది అంటే జగన్ సొంత నియోజకర్గం పులివెందులలో ఆమె శుక్రవారం రాత్రి రోడ్ షో చేశారు. ఈ సందర్భంగా జగన్ ని పట్టుకుని పులివెందుల పులి కాదు జగన్ పిల్లి అని తీవ్ర విమర్శ చేశారు.

ఈ విమర్శ ప్రత్యర్ధులు ఎన్నో సార్లు చేసారు కానీ సొంత చెల్లెలు చేయడమే విశేషం. జగన్ పాలనలో అత్యధికంగా నష్టపోయింది తన సోదరి షర్మిల అని అంటున్నారు. తాను న్యాయం అడుగుతున్నానని తమకు ప్రజలు న్యాయం చేయాలని ఆమె అంటున్నారు.

జగన్ వైపు అన్యాయం ఉందని అన్నారు. ధర్మం తమ వైపు ఉంటే అవతల వైపు అధికారం పలుకుబడి ఉందని అన్నారు. సొంత చిన్నాన్నను హత్య చేస్తే వైసీపీ అధినేతగా పట్టించుకోలేదు అని నిందించారు. మొత్తానికి జగన్ మీద షర్మిల చేస్తున్న విమర్శలు నానాటికీ పదునెక్కుతున్నాయి. జగన్ ఈ నెల 25న పులివెందుల రాబోతున్నారు. ఆయన అక్కడ సభను నిర్వహిస్తారు అని అంటున్నారు.

మరి రోజురోజుకీ జగన్ ని టార్గెట్ చేస్తూ షర్మిల చేస్తున్న విమర్శలు చూస్తూంటే జగన్ తన మీద విమర్శలు చేసేలా కోరి మరీ ముగ్గులోకి లాగుతున్నారు అని అంటున్నారు. జగన్ చెల్లెమ్మ మీద విమర్శలు చేస్తే ఆ హైప్ వేరేగా ఉంటుంది. ఆ ప్రచారం వేరేగా వస్తుంది. అపుడు రాజకీయం వేరేగా మారుతుంది.

మరి ఈ విధంగా వ్యూహంతోనే షర్మిల జగన్ మీద మాటలను మరింతగా పదును పెడుతున్నారా అన్న చర్చ సాగుతోంది. అయితే జగన్ మాత్రం వీటిని లైట్ తీసుకుంటారా లేక ధీటుగా ధాటిగా బదులిస్తారా అన్నది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. అయితే జగన్ మనసు ఎరిగిన వారు ఆయన రాజకీయం గురించి చూసిన వారు చెప్పేది ఒక్కటే. ఆయన అసలు పట్టించుకోరని. కనీసంగా కూడా ప్రస్తావించరని. చూద్దాం మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News