ష‌ర్మిల చెప్పేవి నిజాలేనా? ఈ డౌట్ ఎందుకు వ‌స్తోందంటే!

కానీ, ఏపీలో కాంగ్రెస్ చీఫ్ వైఎస్‌ ష‌ర్మిల చేస్తున్న విమ‌ర్శ‌లు.. చేస్తున్న కామెంట్లు చాలా సీరియ‌స్‌గా ఉన్నాయి.

Update: 2024-04-30 14:30 GMT

ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం అంద‌రికీ తెలిసిందే. నువ్వు 100 కోట్లు తిన్నావ‌ని ఒక‌రు అంటే.. నువ్వు 1000 కోట్లు తిన్నావ‌ని మ‌రొక‌రు అంటారు. ఈ విమ‌ర్శ‌లు కామ‌న్‌. దీనిలో నిజానిజాలు ఆ దేవుడికే ఎరుక‌. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఈ విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు.. కూడా బుట్ట దాఖ‌ల‌వుతాయి. కానీ, ఏపీలో కాంగ్రెస్ చీఫ్ వైఎస్‌ ష‌ర్మిల చేస్తున్న విమ‌ర్శ‌లు.. చేస్తున్న కామెంట్లు చాలా సీరియ‌స్‌గా ఉన్నాయి.

అందునా.. ఆమె చేస్తున్న విమ‌ర్శ‌లు ఎవ‌రో.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై కాదు.. సొంత అన్న‌. ఆయ‌న ద్వారా నే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. కానీ, ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. ఈ ప‌రిణామం దేశంలో మునుపె న్న‌డూ చూడ‌ని రాజ‌కీయం.. మునుపెన్న‌డూ.. ఏ రాష్ట్రంలోనూ జ‌ర‌గ‌ని రాజ‌కీయం. గ‌త రెండు మాసాలుగా అత్యంత క‌ఠిన వ్యాఖ్య‌ల‌తో ష‌ర్మిల విరుచుకుప‌డుతున్నారు. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చేరువైన నేప‌థ్యంలో ఈ దాడిని మ‌రింత ముమ్మ‌రం చేశారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల చేస్తున్న వ్యాఖ్య‌లు, చెబుతున్న విష‌యాలు.. నిజ‌మేనా? అనే సందే హం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌ధానంగా మాజీ సీఎం, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరును.. చార్జిషీట్‌లో ఎక్కించార‌ని.. ఆమె రెండు రోజులుగా చెబుతున్నారు. అయితే.. ఇది సీఎం జ‌గ‌న్ చేయించాడ‌ని.. క‌న్న తండ్రి పేరును చార్జిషీట్‌లో ఎక్కించేలా చేసిందిజ‌గ‌నేన‌ని ష‌ర్మిల చెబుతున్నారు. మ‌రోవైపు.. ఇదే విష‌యంపై సీఎం జ‌గ‌న్ మాత్రం కాంగ్రెస్ పార్టీనే త‌న తండ్రి వైఎస్ పేరును చార్జిషీటులో చేర్చింద‌ని అంటున్నారు.

ఓకే.. ఈ రెండు విష‌యాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ష‌ర్మిల చెబుతున్న‌ట్టు.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరును జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులోని చార్జిషీటులో ఆయ‌నే చేర్చార‌ని అనుకుందాం. కానీ, ఇది ఎప్పుడు జ‌రిగింది? 2011-12 మ‌ధ్య క‌దా! మ‌రి సొంత తండ్రి పేరును సొంత అన్న ఇలా బ‌ద్నాం చేసిన‌ప్పుడు.. అప్పుడు ఎందుకు ష‌ర్మిల స్పందించ‌లేదు? పైగా.. జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణాన్ని అని రాష్ట్రంలో ప‌ర్య‌ట‌న ఎందుకు చేశారు? అనేది డౌట్ కొట్టే ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. ఏదైనా విష‌యం చెబితే. దాని పూర్వాప‌రాలు ఒక‌ప్పుడు అందుబాటులో లేక‌పోయినా.. ఇప్పుడు అంద‌రికీ అందుబాటులో ఉన్నాయి. కాబ‌ట్టి నేత‌ల మాట‌ల నిజాలు ఏమిటో ఇట్టే తెలిసి పోతుంది. ఇక‌, జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నాడు.. అన్నారు ష‌ర్మిల‌. అందుకే క‌డ‌ప‌లో వైఎస్ కుటుంబం మొత్తం తిరిగి ప్ర‌చారం చేస్తోంద‌న్నారు. ఇది నిజ‌మేన‌ని అనుకుంటే.. గత 2019, 2014 ఎన్నిక‌ల్లోనూ.. జ‌గ‌న్ భార్య వైఎస్ భార‌తి.. కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని క‌డ‌ప‌లో తిరిగిన సంగ‌తి ష‌ర్మిల‌కు తెలియంది కాదు.

అంత‌కాదు.. ''వ‌దినా ఆరోగ్యం జాగ్ర‌త్త‌'' అంటూ.. ష‌ర్మిల చేసిన వ్యాఖ్య‌లు.. ఆమె మ‌రిచినా.. జ‌నాలు మ‌రిచిపోలేదు. అలా అనుకుంటే.. ప్ర‌తిపక్ష నాయ‌కుల కుటుంబాలు, అభ్య‌ర్థుల స‌తీమ‌ణులు కూడా.. రంగంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిరుగుతున్నారు. ఇవి ఎన్నిక‌లు. సో.. ఎవరి ప్ర‌య‌త్నం వారిది. ప్ర‌తిదానినీ జ‌గ‌న్‌కు ముడి పెట్ట‌డం ద్వారా.. ఏదో లబ్ధి పొందుతామ‌ని అనుకుంటే.. మొద‌టికే మోసంఎదుర‌య్యే ప‌రిస్థితి వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News